ఐదేళ్ల కనిష్టానికి స్టీల్ ధరలు.. టన్ను ధర రూ.47 వేలకు పతనం

ఐదేళ్ల కనిష్టానికి  స్టీల్ ధరలు.. టన్ను ధర రూ.47 వేలకు పతనం
  • బిగ్​మింట్ ​రిపోర్ట్​

న్యూఢిల్లీ: దేశీయ మార్కెట్లో స్టీల్​ ధరలు ఐదేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయాయి. దిగుమతులు పెరగడం సహా పలు కారణాల వల్ల ప్రస్తుతం టన్ను ధర రూ. 47వేల నుంచి రూ. 48వేల మధ్య ట్రేడ్​ అవుతున్నదని బిగ్​మింట్ మార్కెట్​ డేటా తెలిపింది. హాట్​ రోల్డ్​ కాయిల్​ (హెచ్​ఆర్​సీ)  టన్ను ధర రూ. 47,150కు, రీబార్ ధర హోల్​సేల్​మార్కెట్లో టన్నుకు రూ. 46,500 నుంచి -రూ. 47వేల మధ్య కోట్ అవుతోంది. 

కరోనా తరువాత ధరలు ఇంతలా తగ్గడం ఇదే మొదటిసారి.  ఎగుమతి డిమాండ్ లేకపోవడం​, పెరుగుతున్న దిగుమతులు, అంతర్జాతీయ మార్కెట్లో అధిక సరఫరా కారణంగా ధరలు పడిపోతున్నాయి. చైనా వంటి దేశాల నుంచి దూకుడుగా వస్తున్న ఎగుమతుల ఒత్తిడితో భారతదేశ స్టీల్​ ఎగుమతులు పడిపోయాయి. ప్రభుత్వం పలు చర్యలు తీసుకున్నప్పటికీ, దిగుమతులు మాత్రం పెరుగుతున్నాయి. దీంతో  స్టీల్​ మంత్రిత్వ శాఖ అక్టోబర్​ 27న  ఢిల్లీలో పరిశ్రమల వాటాదారులతో సమావేశం (ఓపెన్​ హౌస్​) ఏర్పాటు చేసింది. 

దిగుమతి ధరలు తగ్గడం వల్లే స్టీల్​ దిగుమతులు పెరిగాయని రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా (ఆర్​బీఐ) కూడా పేర్కొంది. దేశీయ ఉత్పత్తిని పెంచడానికి విధానపరమైన మద్దతు అవసరమని తెలిపింది. ఈ ఏడాది సెప్టెంబర్​లో భారతదేశం 0.79 మెట్రిక్​టన్నుల ఫినిష్డ్​ స్టీల్​ను దిగుమతి చేసుకుంది. ఇది ఆగస్టులోని 0.69 మెట్రిక్​టన్నుల కంటే ఎక్కువ. దీంతో వరుసగా ఆరో నెల కూడా దిగుమతులు భారీగానే నమోదయ్యాయి. 2026 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో కూడా భారత్​ నికర దిగుమతిదారుగా కొనసాగింది. 

ఫినిష్డ్​ స్టీల్​ ధరలు పడిపోయినప్పటికీ, ముడిసరుకు ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. ఐరన్​ ఓర్ ధరలు టన్నుకు రూ. 4,800 నుంచి రూ.ఐదు వేల వరకు ఉన్నాయి. కోకింగ్​ కోల్​ ధర టన్నుకు 205 డాలర్ల వరకు ఉంది. ఉత్పత్తి ఖర్చులు పెరగడం, బలహీనమైన వసూళ్ల కారణంగా అక్టోబర్​– డిసెంబర్​లో మిల్లుల మార్జిన్లపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని బిగ్​మింట్​ పేర్కొంది. అధిక నిల్వలు, డిమాండ్​తగ్గుదల కారణంగా సమీప భవిష్యత్తులో స్టీల్​ ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది.