
న్యూఢిల్లీ: జేఎస్‌డబ్ల్యూ స్టీల్, జేఎస్‌పీఎల్, ఏఎం/ఎన్‌ఎస్, టాటా స్టీల్ వంటి కంపెనీలు వచ్చే నెల నుంచి స్టీల్ రేట్లను పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. టన్నుకు రూ.నాలుగు వేల మేర పెరగవచ్చని ఇండస్ట్రీవర్గాలు తెలిపాయి. విదేశాల నుంచి దిగుమతి అయ్యే హాట్ రోల్డ్ కాయిల్ రేట్లు ఇంటర్నేషనల్ మార్కెట్లో పెరగడమే ఇందుకు కారణమని పేర్కొన్నాయి. రేట్ల పెరుగుదలపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, టన్నుకు రూ.నాలుగు వేల వరకు పెంచాలని మెజారిటీ కంపెనీలు అనుకుంటున్నాయని టాప్ స్టీల్ కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు చెప్పారు. ఈ ఏడాది మార్చిలో స్టీల్ మిల్స్ రేట్లను టన్నుకు రూ.వెయ్యి చొప్పున తగ్గించాయి. కేంద్ర ప్రభుత్వం స్టీల్ దిగుమతులపై కస్టమ్ డ్యూటీని 12.5 శాతం నుంచి 7.5 శాతానికి తగ్గించడమే ఇందుకు కారణం. సెమీస్, ఫ్లాట్, నాన్ అలాయ్, అలాయ్, స్టెయిన్‌లెస్ స్టీల్ రకాలపై కస్టమ్ డ్యూటీ తగ్గింది. అప్పుడు చైనాలో పండగ సమయం కాబట్టి ధరలు కూడా తక్కువ ఉండేవని స్టీల్ కంపెనీలు తెలిపాయి. ఇప్పుడు చైనాతోపాటు ఇంటర్నేషనల్ మార్కెట్లలో హాట్ రోల్డ్ కాయిల్ రేట్లు పెరిగాయని పేర్కొన్నాయి. ప్రస్తుతం హాట్ రోల్డ్ కాయిల్ టన్ను రేటు రూ.56 వేల వరకు ఉండగా, దీనిని రూ.60 వేల వరకు పెంచాలని కంపెనీలు భావిస్తున్నాయి. గత ఏడాది ఏప్రిల్ వీటి ధరలు రూ.35 వేలు–45 వేల మధ్య ఉండేవని డీలర్లు తెలిపారు. స్టీలు ఎగుమతి, దిగుమతుల ధరల మధ్య టన్నుకు దాదాపు 15 వేల తేడా ఉందని, ఈ తేడాను తగ్గించాలని, టన్నుకు రూ.నాలుగు వేల నుంచి రూ.ఆరు వేల వరకు పెంచకతప్పకపోవచ్చని ఇండస్ట్రీకి చెందిన మరో సీనియర్ ఎగ్జిక్యూటివ్ చెప్పారు. ప్రభుత్వరంగ సంస్థ నేషనల్ మినరల్ డెవెలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎండీసీ) టన్ను ఓర్ ధరను రూ.5,350 వరకు పెంచింది.