స్టెర్లింగ్ బయో బ్యాంకులకు ఎగ్గొట్టిన మొత్తం 14,500 కోట్లు

స్టెర్లింగ్ బయో బ్యాంకులకు ఎగ్గొట్టిన మొత్తం 14,500 కోట్లు
  • సందేసరా బ్రదర్స్ రూ.14,500 కోట్ల కుంభకోణం
  • వెల్లడించిన ఈడీ
  • బ్యాంక్‌‌ల కన్సార్టియంలో ఆంధ్రాబ్యాంక్, ఎస్‌‌బీఐ

న్యూఢిల్లీ : వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ, అతని మేనమామ మెహుల్ చోక్సిలు పంజాబ్ నేషనల్ బ్యాంక్‌‌ను ముంచిన కుంభకోణం కంటే అతిపెద్ద మోసం మరొకటి వెలుగులోకి వచ్చింది. సందేసరా బ్రదర్స్‌‌ బ్యాంక్‌‌ల్లో పీఎన్‌‌బీ స్కాం కంటే అతిపెద్ద మోసానికి పాల్పడినట్టు ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్ డైరెక్టరేట్ వెల్లడించింది. స్టెర్లింగ్ బయోటెక్ లిమిటెడ్(ఎస్‌‌బీఎల్‌‌)/సందేసరా గ్రూప్, దాని ప్రమోటర్లు నితిన్ సందేసరా, చేతన్ సందేసరా, దీప్తి సందేసరాలు ఇండియన్ బ్యాంక్‌‌లకు రూ.14,500 కోట్లకు పైగా కుచ్చుటోపి పెట్టినట్టు ఈడీ తెలిపింది. ఇండియన్ బ్యాంక్‌‌ల్లో రూ.5,383 కోట్ల కుంభకోణానికి పాల్పడినందుకు 2017 అక్టోబర్‌‌‌‌లో తొలిసారి వీరిపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) ఎఫ్‌‌ఐఆర్ దాఖలు చేసింది. సీబీఐ ఎఫ్‌‌ఐఆర్ అనంతరం ఈడీ కూడా కేసు రిజిస్టర్ చేసింది.  ఈడీ విచారణలో వీరు కేవలం రూ.5,383 కోట్ల కుంభకోణానికి పాల్పడటమే కాకుండా… ఇండియన్ బ్యాంక్‌‌ల విదేశీ శాఖల నుంచి కూడా సుమారు రూ.9 వేల కోట్ల మేర రుణాలు తీసుకున్నట్టు వెల్లడించింది.

సందేసరా గ్రూప్‌‌కు చెందిన విదేశీ కంపెనీలు ఈ రుణాలను పొందినట్టు తెలిపింది. స్టెర్లింగ్ బయోటెక్ గ్రూప్‌‌ దేశీయ బ్యాంక్‌‌ల నుంచి ఇండియన్, ఫారిన్ కరెన్సీ లోన్స్ పొందినట్టు పేర్కొంది. రుణాలు ఇచ్చిన బ్యాంక్‌‌ల కన్సార్టియంలో ఆంధ్రాబ్యాంక్, యూకో బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,అలహాబాద్ బ్యాంక్,బ్యాంక్‌‌ ఆఫ్ ఇండియాలు ఉన్నాయి. బ్యాంక్‌‌ల నుంచి రుణాలు పొందిన స్టెర్లింగ్ బయోటెక్, అవసరం లేని కార్యకలాపాలకు వాటిని ఉపయోగించినట్టు ఇన్వెస్టిగేషన్ వెల్లడించింది. కేవలం నైజేరియన్ ఆయిల్ బిజినెస్‌‌లకు రుణాలను బదిలీ చేయడమే కాకుండా.. వారి వ్యక్తిగత అవసరాలకు కూడా ఈ రుణాలను దుర్వినియోగం చేసినట్టు ఈడీ తెలిపింది. స్టెర్లింగ్ బయోటెక్, సందేసరా గ్రూప్‌‌కు చెందిన సుమారు రూ.9,778 వేల కోట్ల ప్రాపర్టీస్‌‌ను ఇప్పటికే ఈడీ అటాచ్ చేసింది. అటాచ్ చేసిన ప్రాపర్టీల్లో నాలుగు ఆయిల్ రిగ్స్, నైజీరియాలోని ఆయిల్ ఫీల్డ్, పనామాలో రిజిస్టర్ అయిన తుల్జా భవాని, వరిందా, బ్రహ్మణి వంటి నౌకలు, అమెరికాలో రిజిస్టర్ అయిన ఎయిర్‌‌‌‌క్రాఫ్ట్ 200 గోల్ఫ్‌‌స్ట్రీమ్‌‌, లండన్‌‌లోని రెసిడెన్షియల్ ప్లాట్‌‌ ఉన్నాయి. గతేడాది నితిన్ సందేసరాను దుబాయ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, గతేడాది వెలుగులోకి వచ్చిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం రూ.11,400 కోట్లు. డైమండ్ వ్యాపారులు నీరవ్ మోడీ, మెహుల్ చోక్సి ఈ మోసానికి పాల్పడ్డారు. పీఎన్‌‌బీ ఈ స్కాంకు పాల్పడిన డైమండ్ వ్యాపారులు దేశం విడిచి చెక్కేశారు. వీరిని ప్రస్తుతం ఇండియాకు రప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.