వైన్​ షాపుల నిర్వాహకుల కొత్త దందా

వైన్​ షాపుల నిర్వాహకుల కొత్త దందా
  • బెల్టు షాపులకు అమ్మేందుకు రూ.15 ఎక్కువ ధరతో వైన్​ షాపుల స్పెషల్​ స్టిక్కర్లు 
  • దానికి అదనంగా మరో రూ.15 పెంచి అమ్ముతున్న బెల్టు షాపులు

హైదరాబాద్​ : రాష్ట్రంలోని వైన్​ షాపుల నిర్వాహకులు కొత్త దందాను షురూ చేశారు. మద్యం సీసాలపై స్పెషల్​ స్టిక్కర్లు వేసి ఎక్కువ రేట్లకు బెల్టు షాపులకు అమ్ముకుంటున్నారు. ఈ స్టిక్కర్లుంటే బెల్టు షాపులోళ్లు బహిరంగంగా మద్యం అమ్మినా పోలీసులు, ఎక్సైజ్​ అధికారులు పట్టించుకోవడం లేదు. స్టిక్కర్​ లేకుంటే కేసులు పెడుతున్నారు. దీంతో ఆ స్టిక్కర్లే బెల్టు షాపులకు మద్యం అమ్మకానికి లైసెన్స్​గా మారిపోయాయన్న ఆరోపణలున్నాయి. అక్రమంగా కోట్ల రూపాయల వ్యాపారం సాగుతున్నా అధికారులు పట్టించుకోని పరిస్థితి ఏర్పడింది.  

దందా ఇట్ల చేస్తున్నరు :-
కొత్త దందా కోసం జిల్లాల్లోని వైన్​ షాపుల యజమానులు సిండికేట్​ అవుతున్నారు. బెల్టు షాపులకు మద్యం అమ్మేందుకు స్టిక్కర్లు తయారు చేయించి.. సీసాలకు అంటిస్తున్నారు. ఉదాహరణకు రూ.150 ఉండే బీరుకు అదనంగా రూ.15 కలిపి రూ.165తో స్టిక్కర్​ వేస్తున్నారు. ఆ ధరకు మరో రూ.15 ఎక్కువ పెట్టి బెల్టు షాపుల నిర్వాహకులు మందు అమ్మేస్తున్నారు. అయితే, గ్రామాల్లో తనిఖీలకు వెళ్లే ఎక్సైజ్​, పోలీసు అధికారులు.. స్టిక్కర్లున్న మద్యం అమ్మినా బెల్టు షాపులపై చర్యలు తీసుకోవడం లేదు. వాళ్లకు వైన్స్​ నుంచి కమీషన్లు అందుతున్నాయని, అందుకే చూసీచూడనట్టు వదిలేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. స్టిక్కర్లు లేని మద్యం అమ్మితే మాత్రం అధికారులు ఆ మాల్​ను సీజ్​ చేస్తున్నారు. వెంటనే ఆ మద్యాన్ని వైన్​ షాపు ఓనర్లు స్వాధీనం చేసుకుంటున్నారు. ఇటు వైన్​ షాపుల యజమానుల మధ్య గొడవలు రాకుండా.. మండలాలు, గ్రామాల్లోని బెల్టు షాపులను పంచుకుంటున్నారు. దానికి తగ్గట్టే స్టిక్కర్లు తయారు చేయించి వేయిస్తున్నారు. ఒప్పందం ప్రకారం కాకుండా వేరే మద్యం దుకాణంలో కొనుగోలు చేసినా, స్టిక్కర్లలో తేడా వచ్చినా సదరు బెల్టుషాపులపై పోలీసులతో కేసులు పెట్టిస్తున్నారు.

మరిన్ని వార్తల కోసం : -
ఐదేండ్లుగా కొనసాగుతున్న సదర్మట్ బ్యారేజీ వర్క్స్


పాలిసెట్​కు దరఖాస్తు గడువు పెంపు