జనగామ, వెలుగు: జనగామ జిల్లా వైద్య శాఖలో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఫిబ్రవరి నుంచి నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో వారం వ్యవధిలో వేసిన నోటిఫికేషన్లు రెండు సార్లు రద్దు కావడం నిరుద్యోగుల్లో ఆసహనం నెలకొంటున్నది. ఈనెల 13న 50 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేన్ ఇచ్చారు. దీనిని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు 15న ప్రకటన విడుదల చేశారు. ఆ తర్వాత అందులో కొన్ని సవరణలు చేసి, ఈనెల 18న రెండోసారి నోటిఫికేషన్ జారీ చేశారు.
ఇందులో మొదటి నోటిఫికేషన్లో ఉన్న 7 డీఈవో పోస్టులు, 3 సిటీ స్కాన్ టెక్నీషియన్ పోస్టులను పక్కన పెట్టారు. మిగిలిన 40 పోస్టులకు ఈనెల 20న నేరుగా ఇంటర్వ్యూలకు ఆహ్వానించారు. అంతలోనే ఏమైందో తెలియదు కానీ తాజాగా ఆ నోటిఫికేషన్ ను సైతం తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ గోపాల్ రావు గురువారం ప్రకటించారు. దీంతో అభ్యర్థులు గందరగోళానికి గురవుతూ, పోస్టుల భర్తీ పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరు పై మండి పడుతున్నారు.