జడ్జి గారి కథలు

జడ్జి గారి కథలు

రోజుకో కథ, రోజూ ఒక వీడియో… తెలంగాణా, తెలుగు సాహిత్యాల్లో ‘జింబో’ రాజేందర్ పేరు తెలియని వాళ్లు చాలా తక్కువే. జిల్లా సెషన్స్ జడ్జిగా రిటైర్ అయిన జింబో’… సీనియర్ ఫ్యాకల్టీ మెంబర్‌‌‌‌గా, డైరెక్టర్‌‌‌‌గా కూడా పని చేశారు. పోలీస్ అకాడమీలోనూ డిప్యుటేషన్ మీద పనిచేశారు. అయితే ఇదంతా వృత్తిపరంగా ఉండే ట్రాక్ రికార్డ్. కానీ తెలుగు కథా ప్రపంచంలో ‘జింబో’ గా ఆయనకి ఉన్న క్రేజ్ వేరు.

‘జింబో కథలు, ‘రూల్ ఆఫ్ లా’,

‘మా వేములవాడ కథలు’, ‘ఓ చిన్న మాట’ అనే స్టోరీ కలెక్షన్స్ వచ్చాయి. ‘కథలకి ఆవల’ అనే మరో పుస్తకం అనువాద కథలతో వచ్చింది. ఒక జడ్జిగా రిటైర్ అయినా కథకుడిగా, రచయితగా మాత్రం రిటైర్ కాలేదు, ఇంకా కొత్త కథల పుస్తకాల వర్క్‌‌లో బిజీగానే ఉన్నారు. మరో మూడు బుక్స్ ప్రింట్‌కి సిద్దంగా ఉన్నాయి. ఇంతకీ ఈ “జింబో” ముద్ర ఇంత బలంగా పడటానికి కారణం ఏమిటి? అంటే. ప్రతీ కథా ఒక సామాజిక పాఠం అంటారు ఆయన రచనలని చదివిన వాళ్లు. ఫ్రొఫెషన్‌‌లో ఎదురైన అనుభవాలనీ, దానిని చుట్టి ఉండే కొన్ని సామాజికలోపాలనీ టచ్ చేసి రాసిన కథలన్నీ ఎక్కువమందిని ఆకట్టుకోవటానికి కారణం, మనమంతా చూసి కూడా పట్టించుకోలేని సమస్యలని మనకి చూపించే ప్రయత్నం చెయ్యటమే.

అయితే ఇప్పుడు మళ్లీ జింబో కథల గురించి మాట్లాడుకోవటం ఎందుకు అంటే..,

ఈ మధ్యనే ఒక కొత్త ప్రయోగం మొదలు పెట్టారు జింబో. మారుతున్న టెక్నాలజీతో మనమూ ముం దుకు వెళ్తూనే ఉండాలి. ఆ ప్రయత్నంలో భాగంగానే ‘‘కథా చాలనం’’ పేరుతోఒక యూట్యూబ్ చానెల్ ఓపెన్ చేసి. రోజుకో కథ ఆయనే స్వయంగా చదివి ఆ వీడియోని అప్‌ లోడ్ చేస్తున్నారు. ప్రతీరోజూ ఒక కథ పేరుతో ఇప్పటికి 60కి పైగానే కథలు యూట్యూబ్ లో ఉన్నాయి. ఇంకా ఇంకా వస్తూనే ఉన్నాయి.

‘జింబో’ అనే పేరు అలా వచ్చింది..

నా చిన్నప్పుడు కొంచెం లావుగా ఉండటం, ఎత్తుకూడా ఎక్కువగానే ఉండటం వల్ల మా అన్న రఘుపతి ‘జింబో’అని పిలిచేవాడు. పోను పోనూ అసలు పేరుకన్నా ఆ ముద్దు పేరే ఎక్కువ పాపులర్ అయ్యింది. ఇప్పటికీ మంగారి రాజెందర్ అంటే గుర్తుపట్టని వాళ్లు కూడా జింబో రాజేందర్ అంటే ఠక్కున గుర్తు పడతారు.

కథ చెప్పటంలో ఓ ఆనందం ఉంటుంది

గాలి లాగా, నీరు లాగా కథలు ప్రపంచమంతా ఉంటాయి. అవి అవసరం కూడా. కథ చేసే పని ఉపన్యాసం కన్నా ఎక్కువ. కథ చెప్పటంలో ఓ ఆనందం ఉంటుంది. చదవడంలో, వినడంలో ఇంకా గొప్ప ఆనందం ఉంటుంది. యూట్యూబ్ లో ఇప్పుడు నేను చేస్తున్న పని అదే. కొందరు మిత్రులు అమెరికాలో ‘కథలు మాకిష్టం ’ అనే గ్రూప్ లో ఈ కథా వీడియోలని షేర్ చేస్తున్నారు.