సైనైడ్ కిల్లర్ కథ

సైనైడ్ కిల్లర్ కథ

ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్న రాజేష్ టచ్ రివర్ తన కొత్త సినిమాను ప్రకటించారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్ స్ట్రక్టర్, సంచలనం సృష్టించిన క్రిమినల్ మోహన్ కథతో ఆయన ‘సైనైడ్’ అనే సినిమాను రూపొందించనున్నారు. పారిశ్రామికవేత్త ప్రదీప్ నారాయణన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో రూపొందే ఈ క్రైమ్ థ్రిల్లర్ను… గురువారం ‘సైనైడ్’ మోహన్ కేసులో తుది తీర్పు వచ్చిన సందర్భంగా అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ ‘ప్రేమ పేరుతో అమ్మాయిల్ని కర్ణాటకలోని వివిధ హోటల్ రూమ్ లకు పిలిచి, వాంఛ తీరిన తర్వాత యువతులకు గర్భనిరోధక మాత్రలని చెప్పి సైనైడ్ పిల్స్ ఇచ్చి చంపేవాడు మోహన్. తర్వాత వారి బంగారు ఆభరణాలతో ఉడాయించేవాడు. ఏమాత్రం కనికరం లేకుండా దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ఇరవై మందిని చంపేసిన కేసులో మోహన్ కు  ఆరు మరణశిక్షలు, 14 జీవిత ఖైదులు విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. అతనిపై సినిమా తీయబోతున్నా. తెలుగు, మలయాళ, తమిళ, కన్నడ, హిందీ చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖ యాక్టర్స్ నటిస్తారు’ అని చెప్పారు. నిర్మాత ప్రదీప్ మాట్లాడుతూ ‘కరోనా భయం పోయిన తర్వాత, ప్రభుత్వ అనుమతులు తీసుకొని షూటింగ్ ప్రారంభిస్తాం. గోవా, బెంగళూరు, మంగుళూరు, కూర్గ్, మడక్కరి, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో తీస్తాం. రాజేష్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. సునీతా కృష్ణన్ మా కంటెంట్ అడ్వైజర్. కమల్ హాసన్ విశ్వరూపం, ఉత్తమ విలన్ చిత్రాలకు కెమెరామన్​గా పని చేసిన సదత్ సైనుద్దీన్ పని చేస్తున్నారు’ అన్నారు.