ఇతర పార్టీల  ప్రతినిధులకు సకల మర్యాదలు

 ఇతర పార్టీల  ప్రతినిధులకు సకల మర్యాదలు
  • మునుగోడులో సొంత నేతలపై టీఆర్ఎస్ నిఘా
  • ఎలక్షన్ల దాకా నేతలను కాపాడుకోవడానికి...

పక్క పార్టీల వాళ్లకు వరాలు.. సొంత పార్టీ వాళ్లకు  బెదిరింపులు. ప్రస్తుతం మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ ఫాలో  అవుతున్న రూల్ ఇదే. రోజూ ఇతర పార్టీల  ప్రతినిధులకు సకల మర్యాదలతో ఆహ్వానిస్తున్న టీఆర్ఎస్.. సొంత నేతలపై నిఘా పెట్టడం..పార్టీలో చర్చనీయాంశంగా మారింది. 

నల్గొండ జిల్లా మునుగోడు నియోజక వర్గానికి ఉప ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ టీఆర్ఎస్ పార్టీలో విచిత్ర రాజకీయాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ సర్పంచ్, జడ్పీటీసీ, ఎంపీటీసీలకు గులాబీ కండువాలు కప్పుతుంటే.. టీఆర్ఎస్ స్థానిక ప్రజా ప్రతినిధులు బీజేపీలోకి జంప్ అవుతున్నారు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను అన్ని రకాలుగా సంతృప్తి పరిచి పార్టీలోకి తీసుకురావడం.. సొంత పార్టీ ప్రజా ప్రతినిధుల్లో అసంతృప్తిని రాజేస్తోంది. 

ఇప్పటికే కాంగ్రెస్ నుంచి చాలా మంది ప్రజా ప్రతినిధులను టీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. వీరికి అన్ని రకాలుగా సంతృప్తి పరిచిన టీఆర్ఎస్ నేతలు.. సొంత పార్టీ ప్రజాప్రతినిధుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారని చర్చ జరుగుతోంది. ఇప్పటికే చౌటుప్పల్ ఎంపీపీ తాడూరి వెంకట్ రెడ్డి పార్టీ మారుతున్నారన్న సమాచారంతో పాత కేసులో అరెస్ట్ చేయించే ప్రయత్నం చేశారు. చివరికి ఆయన బీజేపీలో చేరారు. ఇప్పటికీ పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులు.. టీఆర్ఎస్ లోనే ఉంటామని చెబుతున్నా తమను పట్టించుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

టీఆర్ఎస్ ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచులను పట్టించుకోక పోగా వారి పైనే పార్టీ నిఘా పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. వారి కదలికలు ఏంటి..? ఎవరిని కలుస్తున్నారు..? పార్టీలో వుంటారా ? పోతారా ? అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. చౌటుప్పల్ ఎంపీపీ వెంకట్ రెడ్డితో సన్నిహితంగా ఉండే నేతల లిస్ట్ రెడీ చేసి వారిపైనే ప్రత్యేక నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. వారి పాత కేసులు ఏ పోలీస్ స్టేషన్లలో వున్నాయి.. ఎట్లా వారి పైన కేసులు పెట్టొచ్చు ఇలాంటి ఫైల్స్ అన్ని సిద్దం చేసుకొని వున్నట్లు చర్చ జరుగుతోంది.

మునుగోడులో సొంత పార్టీ ప్రజా ప్రతినిధులకు ఎన్నికల బాధ్యతలు అప్పగిస్తున్నా..మంచి చెడూ చూసుకోవడం లేదనే ఆవేదనలో స్థానిక లీడర్లు ఉన్నట్లు కనిపిస్తోంది. సీఎం కేసీఆర్ సభ తర్వాత పార్టీని వీడి పోతారనే అనుమానంతోనే తమను పట్టించుకోవడం లేదని కొందరు నేతలు చెబుతున్నారు. ఎలక్షన్ కు ఇంకా చాలా సమయం ఉందని, అప్పటిదాకా సొంత పార్టీ ప్రజా ప్రతినిధులను కాపాడుకోవడం ఎలా అన్న ఆలోచన చేస్తున్నారు.