అంతర్వేది సముద్ర తీరంలో విచిత్ర పరిస్థితి

అంతర్వేది సముద్ర తీరంలో విచిత్ర పరిస్థితి
  • 2 కిలోమీటర్లు వెనక్కి వెళ్లిన సముద్రం
  • కొన్ని చోట్ల వెనక్కు... మరికొన్ని చోట్ల ముందుకు

కాకినాడ: తూర్పు తీరంలో సాగరుడు భయపెడుతున్నాడు. కొన్ని చోట్ల ముందుకు, మరికొన్నిచోట్ల వెనక్కు.. అది కూడా కూతవేటు దూరంలోనే కిలోమీటర్ల మేర భిన్నమైన మార్పులు వస్తుండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అంతర్వేది సముద్రతీరంలో నెలకొందీ వింత పరిస్థితి ఏర్పడింది. గత కొద్ది రోజులుగా ముందుకు చొచ్చుకుని వచ్చిన సముద్రం కొద్దిసేపటి క్రితం ఉన్నట్లుండి రెండు కిలోమీటర్లు వెనక్కి వెళ్లిపోయింది.

బంగాళాఖాతంలో గోదావరి నది కలిసే సంగమ ప్రదేశం.. అంతర్వేది.  తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలో ఉన్న అంతర్వేదిలో లక్ష్మీ నరసింహ స్వామి కొలువై ఉన్నాడు. స్వామి దర్శనానికి నిత్యం పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. గత కొద్ది రోజులుగా అంతర్వేది వద్ద సముద్రం ముందుకు చొచ్చుకొస్తోంది. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అలలు ప్రజలను భయపెడుతున్నాయి. నిన్న అలలు పోటెత్తి సాగరం ముందుకు చొచ్చుకుని రాగా.. కొద్దిసేపటి క్రితం ఉన్నట్టుండి రెండు కిలోమీటర్ల మేర వెనక్కి వెళ్లిపోయింది. గతంలో అమావాస్య, పౌర్ణానికి ముందుకు వచ్చే సముద్రం .. గత నెల రోజులుగా 45 మీటర్ల మేర ముందుకు చొచ్చుకొచ్చింది. తాజాగా కొన్నిచోట్ల వెనక్కు వెళ్లిపోవడంతో విచిత్ర పరిస్థితినిచూసి తీర ప్రాంత గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు.