శునకాన్ని పులిలా మార్చారు.. మండిపడుతున్న యానిమల్ లవర్స్

శునకాన్ని పులిలా మార్చారు.. మండిపడుతున్న యానిమల్ లవర్స్

న్యూఢిల్లీ: ఒక కుక్కకు రంగులు వేసి దాన్ని పులిగా కనిపించేలా చేయడంపై మలేషియాలో అధికారులు, జంతు ప్రేమికులు మండిపడుతున్నారు. సదరు శునకానికి ఆరెంజ్, బ్లాక్ కలర్స్ వేసి పులిలా కనిపించేలా చేయడంపై యానిమల్ లవర్స్ కోప్పడుతున్నారు. సదరు కుక్క ఫొటోలను పర్సాతువాన్ హైవాన్ లేదా ది మలేషియన్ యానిమల్ అసోసియేషన్ ఫేస్ బుక్ లో షేర్ చేసింది. శునకాన్ని పులిలా మార్చేందుకు రంగులు పూసిన వారిని అరెస్టు చేయాలని ఆ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ ఘటనపై విస్తృత సమాచారం అందించాలని యానిమల్ రైట్స్ గ్రూప్ కోరింది. డాగ్ కు పెయింటింగ్ వేసిన వారిని విడిచిపెట్టేది లేదని స్పష్టం చేసింది.

జంతువులకు రంగు అద్దిన ఘటనలు గతంలో కూడా వివాదాస్పదయ్యాయి. యానిమల్స్ పై వాడిన పెయింట్స్ విష పూరితం లేదా ప్రమాదకరంగా ఉంటాయని విమర్శలు వచ్చేవి. సదరు కుక్క ఎక్కడ ఉందో గుర్తించడానికి సాయపడాలని, అదెవరికి చెందినదో చెప్పాలని యానిమల్ మలేషియా చెప్పింది. దీనికి సంబంధించిన వివరాలు చెబితే రివార్డు కూడా ఇస్తామని ప్రకటించడం విశేషం. సదరు కుక్క ఫొటోలు నెట్ లో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలకు ఫేస్ బుక్ లో దాదాపు 3 వేలకు మించి షేర్లు వచ్చాయి. కొందరు నెటిజన్స్ సదరు కుక్కను మినీ టైగర్ గా పిలుస్తున్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిని వదిలిపెట్టొద్దని మరికొందరు నెటిజన్స్ అంటున్నారు.