నిజామాబాద్ జిల్లాలో..రెచ్చిపోతున్న వీధికుక్కలు

నిజామాబాద్ జిల్లాలో..రెచ్చిపోతున్న వీధికుక్కలు
  •     రోజుకు సగటున ఆరేడు కేసులు 
  •     దాడిలో ఇప్పటికే ఇద్దరు చిన్నారులు బలి
  •     వ్యాక్సిన్ ఇచ్చినా దక్కని ప్రాణాలు
  •     నామ్​కేవాస్తేగా సిటీలోని ఏబీసీ సెంటర్
  •     జాడలేని బర్త్​ కంట్రోల్​ఆపరేషన్లు

నిజామాబాద్, వెలుగు : జిల్లాలో వీధికుక్కల బెడద జనాన్ని పరేషాన్ చేస్తోంది. ఇంట్లోంచి బయటకు వస్తే చాలు ఏ మూల నుంచి వచ్చి దాడి చేస్తాయో అర్థంకాని పరిస్థితి. గల్లీల్లో గుంపులుగా తిరుగుతూ కనిపించిన వారిపై దాడిచేస్తున్నాయి. ఈ మధ్య కుక్కకాటుతో ఇద్దరు చిన్నారుల మరణించడం తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చాయి. నగరంలోని జీజీహెచ్​ హాస్పిటల్​కు నిత్యం ఆరేడుగురికి తగ్గకుండా బాధితులు యాంటీ రేబిస్​​ ట్రీట్​మెంట్ ​కోసం వస్తున్నారు.

వర్షాల తర్వాత పెరిగిన సంతతి

530 గ్రామాలున్న జిల్లాలో బోధన్, ఆర్మూర్, భీంగల్​మున్సిపాలిటీలు. నిజామాబాద్ ​నగరంలో కార్పొరేషన్ ​ఉంది. పల్లె, పట్నం తేడా లేకుండా గడిచిన ఆరు నెలల్లో వీధి కుక్కల సంతతి గణనీయంగా పెరిగింది. గతంలో అయిదారు కుక్కలున్న గల్లీల్లో ఇప్పుడు వాటి సంఖ్య 20కి చేరింది. ఉన్నట్లుండి ఒక్కసారిగా దారినపోయే వారిపై పడి తీవ్రంగా గాయపరుస్తున్నాయి. 

పసిప్రాణాలు బలి

మాక్లూర్​ మండలం కల్లెడ విలేజ్​లో ఇంటి బయట ఆడుకుంటున్న ఐదేండ్ల బాలుడు నిశాన్ష్​ను వీధి కుక్క తలపై కరిచింది. ట్రీట్​మెంట్​తీసుకుంటూ ఈ నెల3న మరణించాడు. రెండేండ్ల బాలుడు నబీల్​ఖాన్​ను వరండాలో కూర్చోబెట్టి తల్లి పాలసీసా తేవడానికి ఇంట్లోకి వెళ్లగా, రెండు నిమిషాల్లోనే కుక్క ఆ  చిన్నారిని పట్టేసింది. సిటీకి చెందిన ఈ బాలుడు ట్రీట్​మెంట్​పొందుతూ డిసెంబర్​10న చనిపోయాడు. ఒక్కగానొక్క సంతానం కుక్కకాటుకు చనిపోవడంతో తల్లిదండ్రులకు రోదనే మిగిలింది. నాలుగు రోజుల కింద ఆర్మూర్​ టౌన్​లో ఏడేండ్ల బాలుడు అభిరాంను కుక్క కరవగా తండ్రి దొండి వినోద్​ కుమార్​ ఫేస్​బుక్, వాట్సాప్​లో ఎమ్మెల్యే పైడి రాకేశ్​రెడ్డికి పోస్టులు పెట్టారు.

‘మీ ప్రసంగాలు బాగానే ఉన్నాయి? మొదట కుక్కల బెడద నుంచి ప్రజలను కాపాడమని’ కోరారు.  యాంటీ రేబిస్​​ వాక్సిన్​ కోసం ప్రతి రోజు కనీసం ఏడుగురు గవర్నమెంట్​హాస్పిటల్ కు వస్తున్నారు. ఈనెలలో ఇప్పటిదాకా 176 మంది జీజీహెచ్​హాస్పిటల్​కు వ్యాక్సిన్​ వేయించుకోడానికి వచ్చారు. నవంబర్​, డిసెంబర్​లో 402 మంది కుక్కకాటుకు గురయ్యారు. కుక్కల బెడదతో ఇంటి బయటకు రావడానికి ప్రజలు జంకుతున్నారు. వీధి దీపాలు లేని కాలనీల్లో పరిస్థిత మరీ దారుణంగా ఉంది. 

పేరుకే యానిమల్​బర్త్​ కంట్రోల్ ​సెంటర్ 

 గ్రామ పంచాయతీలు, మున్సిపల్​ యంత్రాంగంపై వీధి కుక్కల నియంత్రణ బాధ్యత ఉంటుంది. జంతు సంరక్షణ చట్టం ప్రకారం వాటిని చంపడానికి వీల్లేదు. గల్లీ కుక్కలకు ఆహారం, నీళ్ల వసతి కల్పించి జనసంచారం లేని డంపింగ్ ​యార్డులో వదలాలి. సంతాన పెరుగుదలను ఆపే చర్యలు తీసుకోవాలి. ఇందుకు జిల్లా కేంద్రంలో యానిమల్​ బర్త్​ కంట్రోల్ ​సెంటర్​(ఏబీసీ) ఉంది. వీధి కుక్కలను ఆ సెంటర్​కు తరలించి గవర్నమెంట్ ​వెటర్నరీ డాక్టర్లతో బర్త్​ కంట్రోల్​ ​ఆపరేషన్​లు చేసి, కోలుకున్నాక వదిలేయాలి.

వీధి కుక్కుల ఫిర్యాదుల కోసం జిల్లా మొత్తానికి కలిపి సిటీలోని మున్సిపల్ ​కార్పొరేషన్​లో కమిషనర్​ మంద మకరంద్​ ల్యాండ్ ​లైన్​ ఏర్పాటు చేయగా సిబ్బంది కాల్స్​ రిసీవ్​ చేసుకోవడం లేదు. కుక్కల బర్త్​రేట్ ​తగ్గించడానికి స్థానిక పాలకులు ఫండ్స్ ​మంజూరు చేసి ఖర్చు చేయకుండా వదిలేశారు.