నల్గొండజిల్లాలో వీధికుక్కల దత్తత.. 13న ప్రారంభం కానున్న దత్తత డ్రైవ్‌‌

నల్గొండజిల్లాలో వీధికుక్కల దత్తత.. 13న ప్రారంభం కానున్న దత్తత డ్రైవ్‌‌
  • ‘అడాప్ట్‌‌ జాయ్‌‌ వన్‌‌ పా ఎట్ ఎ టైమ్’ నినాదంతో సరికొత్త కార్యక్రమం
  • ఇప్పటికే 50 మంది రిజిస్ట్రేషన్‌‌

నల్గొండ, వెలుగు : నల్గొండ జిల్లాలో వీధి కుక్కల దత్తత, వ్యాక్సినేషన్‌‌, స్టెరిలైజేషన్‌‌ కార్యక్రమాలకు నల్గొండ జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. జీహెచ్‌‌ఎంసీ తర్వాత నల్గొండ జిల్లాలోనే మొదటిసారిగా ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 

జిల్లాలోని దేవరకొండ మున్సిపాలిటీలో గత వారం కుక్కల దత్తత, వ్యాక్సినేషన్‌‌ కార్యక్రమాలను చేపట్టగా.. విశేష స్పందన రావడంతో నల్గొండ మున్సిపాలిటీలో సైతం అమలు చేసేందుకు నిర్ణయించారు. ఇందులో భాగంగా ‘అడాప్ట్‌‌ జాయ్‌‌ వన్‌‌ పా ఎట్ ఎ టైమ్’ అనే నినాదంతో ఈ నెల 13వ తేదీన నల్గొండ పట్టణంలోని రాంనగర్‌‌ పార్క్‌‌లో దత్తత డ్రైవ్‌‌ను నిర్వహిస్తున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి చేతుల మీదగా ఈ కార్యక్రాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

వీధి కుక్కల దత్తతకు రిజిస్ట్రేషన్‌‌

కుక్కలను దత్తత తీసుకోవాలనుకునేవారు మొదట మున్సిపల్‌‌ కమిషనర్‌‌ వద్ద ఉచితంగానే రిజిస్ట్రేషన్‌‌ చేసుకోవాల్సి ఉంటుంది. దత్తత కోసం ఇప్పటికే 50 కుక్క పిల్లలను ఎంపిక చేసి, వాటికి డీవార్మింగ్‌‌ చేయడంతో పాటు వ్యాక్సిన్లు వేశారు. 

కుక్క పిల్లలను తీసుకునేందుకు ఇంకా ఎవరైనా ముందుకు వస్తే 100 పిల్లల వరకైనా దత్తత ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. హైదరాబాద్‌‌ తరహాలోనే.. నల్గొండలో కూడా త్వరలోనే పెంపుడు కుక్కల రిజిస్ట్రేషన్‌‌ కార్యక్రమాన్ని సైతం ప్రారంభించనున్నట్లు అధికారులు ప్రకటించారు. 

ప్రజలకు అవగాహన కల్పించేలా కార్యక్రమాలు

నల్గొండ  జిల్లా వ్యాప్తంగా సుమారు 40 వేల కుక్కలు ఉన్నట్లు సర్వేలో తేలింది. వీధి కుక్కలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మున్సిపల్, గ్రామీణ ప్రాంతాల్లో హోర్డింగ్‌‌లు ఏర్పాటు చేయడంతో పాటు ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారు. అన్ని కుక్కలకు వ్యాక్సినేషన్‌‌, స్టెరిలైజేషన్‌‌ చేయించడంతో పాటు పెంపుడు కుక్కలకు సైతం వాక్సిన్లు వేయించేలా యజమానులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా ర్యాలీలు తీయడం, పాంప్లెంట్లు పంచడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. దీంతో పాటు ప్రజలు కుక్క కాటుకు గురికాకుండా ఉండడం, ఒక వేళ కరిస్తే రేబిస్‌‌ సోకకుండా వ్యాక్సిన్‌‌ వేయించుకోవడం, తీసుకోవాల్సిన ఇంజక్షన్లపై అవగాహన 
కల్పిస్తున్నారు.

దత్తతకు ముందుకు రావాలి 

ఇటీవల జగిత్యాల జిల్లాలో జరిగిన కుక్కకాటు ఘటన మాదిరిగా నల్గొండ జిల్లాలో జరగకుండా చర్యలు తీసుకున్నాం. ఇప్పటికే జిల్లాలో వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్ పై విస్తృతంగా ప్రచారం కల్పిస్తున్నాం. దీంతో పాటు కుక్కల దత్తత కార్యక్రమం చేపట్టాం. ఈ కార్యక్రమానికి విశేష స్పందన వస్తుంది. ఇప్పటికే 50 మంది రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. 100 కుక్కలకు వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్ చేసి అందుబాటులో ఉంచం. ప్రజలు కుక్కలను దత్తత తీసుకునేందుకు ముందుకు రావాలి. 

- ఇలా త్రిపాఠి, కలెక్టర్, నల్గొండ-