పెద్దోళ్లే కాదు.. పిల్లలు కూడా ఈ మధ్య కాలంలో సరిగా తిండి తినడం లేదు.. బలమైన ఆహారం లేకపోవడం.. రోగ నిరోధక శక్తి లోపించడం... మూడు పదులు కూడా రాకముందే ఆపసోపాలు.. కీళ్లనొప్పులు.. ఇలా అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు.. ఇక బీపీ..షుగర్ కామన్ అనుకోండి. అయితే గట్టిగా ఉండే ఆహారానికి బదులు కాస్తంత జారుడుగా.. ఉండే అంబలిని తింటే . ఇది ఆకలిని తీర్చడమే కాదు.. . ఆ టేస్టే వేరు. ఆరోగ్యాన్ని కాపాడే అంబలిని పిల్లలు ఒక్కసారి తిన్నారంటే అసలు వదలి పెట్టరు.. మళ్లీ మళ్లీ కావాలంటారు.. అయితే బలమైన ఆహారం అంబలిని ఎన్ని రకాలుగా.. ఏవిధంగా.. ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ...
బియ్యం - పెసర పప్పు
కావాల్సినవి : బియ్యం - మూడు టేబుల్ స్పూన్లు ....ఉప్పు - చిటికెడు ...పెసర పప్పు - రెండు టేబుల్ స్పూన్లు
తయారీ : ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి అరబెట్టాలి. పూర్తిగా తడారిపోయాక మిక్సీలో గ్రైండ్ చేయాలి. పెసర పప్పును కొద్దిగా వేయించి మిక్సీ పట్టాలి. తర్వాత రెండింటినీ ఒక గిన్నెలో వేయాలి. ఉప్పు, సరిపడా వేడి నీళ్లు పోసి బాగా కలపాలి. అంతే బియ్యంతో తయారు చేసిన అంబలి రెడీ
ఇలాచీ - గోధుమ రవ్వ
కావాల్సినవి : గోధుమ రవ్వ - మూడు టేబుల్ స్పూన్లు.... పెసర పప్పు - రెండున్నర టేబుల్ స్పూన్లు... బెల్లం తురుము - అర టీ స్పూన్... ఇలాచీలు- నాలుగు
తయారీ : పెసర పప్పు, గోధుమ రవ్వ, ఇలాచీలను విడివిడిగా వేగించాలి. తర్వాత మిక్సీలో వేసి పొడి చేయాలి. తర్వాత మూడు పొడులను ఒక గిన్నెలో వేసి, బెల్లం తురుము, సరిపడా వేడి నీళ్లు పోసి కలపాలి. మిశ్రమం ఉండలు కట్టకుండా కొద్దిసేపు కలుపుతూనే ఉండాలి. పూర్తిగా చల్లారాక కొద్దిగా నెయ్యి కలిపి పిల్లలకు తినిపించాలి. ఈ అంబలిని పిల్లలు ఒక్కసారి రుచి చూశారంటే.. మళ్లీ మళ్లీ కావాలంటారు.
తేనె- ఓట్స్
కావాల్సినవి : పాలు - ముప్పావు కప్పు ...ఓట్స్ - తగినన్ని... తేనె - ఒక టేబుల్ స్పూన్
తయారీ: పాలను బాగా వేడి చేయాలి. అవి వేడెక్కాక అందులో ఓట్స్ వేసి కలపాలి. ఓట్స్ పాలలో పూర్తిగా నానిన తర్వాత మళ్లీ కలపాలి. ఇప్పుడు మంటను అపేసి, ఆ మిశ్రమంలో తేనె వేయాలి. నోరూరించే తియ్య తియ్యని తేనె, ఓట్స్ అంబలి రెడీ.
స్వీట్ కార్న్
కావాల్సినవి: స్వీట్ కార్న్ (మొక్కజొన్న) గింజలు - పావు కప్పు... పెసర పప్పు పొడి- 4 టేబుల్ స్పూన్లు.... చక్కెర -... నువ్వుల పొడి - అర టేబుల్ స్పూన్
తయారీ: మొక్కజొన్న గింజలను ఉడికించి పేస్ట్ చేయాలి. పెసర పప్పు, నువ్వులను విడివిడిగా వేయించి పొడి చేయాలి. ఒక గిన్నెలో మొక్కజొన్న గింజల పేస్ట్, పెసర పప్పు, నువ్వుల పొడి, చక్కెర, సరిపడా వేడి నీళ్లు వేసి కలపాలి. మొక్కజొన్న గింజలు దొరకనప్పుడు మొక్కజొన్న పిండి (కార్న్ ఫ్లోర్)తోనూ చేసుకోవచ్చు
సోయాబీన్- గోధుమలు
కావాల్సినవి: గోధుమలు - ఐదు టేబుల్ స్పూన్లు... ఉప్పు లేదా చక్కెర -... సోయాబీన్ గింజలు - ఒకటిన్నర టేబుల్ స్పూన్
తయారీ: గోధుమలు, సోయాబీన్ గింజలను బాగా వేయించి విడివిడిగా మిక్సీ పట్టాలి. తర్వాత రెండు పొడులనూ ఒక గిన్నెలోకి తీసుకుని, అందులో ఉప్పు లేదా చక్కెర, సరిపడా వేడి నీళ్లు పోసి బాగా కలపాలి. అంతే.. గోధుమలు, సోయాబీన్స్ తో చేసిన అంబలి రెడీ.
పల్లీలు- గోధుమలు
కావాల్సినవి: పల్లీలు- మూడు టేబుల్ స్పూన్లు... గోధుమలు - మూడు టేబుల్ స్పూన్లు... ఉప్పు లేదా చక్కెర - ... పెసలు-రెండున్నర టేబుల్ స్పూన్లు
తయారీ : పల్లీలు, గోధుమలు, పెసలను బాగా వేయించాలి. తర్వాత వాటన్నింటినీ కలిపి మిక్సీ పట్టాలి. ఆ మిశ్రమాన్ని గిన్నెలోకి తీసుకుని, ఉప్పు లేదా చక్కెర వేసి, సరిపడా వేడి నీళ్లు పోసి కలపాలి. అప్పటికప్పుడు బలాన్ని, ఆకలిని తీర్చగల అంబలి ఇది.