గుడిహత్నూర్, వెలుగు: బాల్య వివాహాలు జరగని ఆదిలాబాద్ జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ రాజర్షిషా పిలుపునిచ్చారు. ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా మంగళవారం గుడిహత్నూర్ మండలం మన్నూర్లోని ప్రైమరీ స్కూల్లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన మహిళా వారోత్సవాల్లో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు.
వివాహం చేయాలంటే చట్టప్రకారం అమ్మాయిలకు 18, అబ్బాయిలకు 21 ఏళ్లు నిండి ఉండాలని స్పష్టం చేశారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు గుర్తిస్తే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1098కు కాల్ చేసి సమాచారం అందించాలని సూచించారు.
నస్పూర్, వెలుగు: బాల్య వివాహాల నిర్మూలనకు సమిష్టిగా కృషి చేద్దామని మంచిర్యాల అడిషనల్ కలెక్టర్ పి.చంద్రయ్య పిలుపునిచ్చారు. కలెక్టరేట్ లో జరిగిన మహిళా సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా బాల్య వివాహాల నిర్మూలనపై డీసీపీ భాస్కర్, అధికారులతో రివ్యూ నిర్వహించారు. అనంతరంవాల్ పోస్టర్లను ఆవిష్కరించారు.
