- రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
సిద్దిపేట టౌన్, వెలుగు: ప్రభుత్వం అమలు చేస్తున్న ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య హెచ్చరించారు. శుక్రవారం సిద్దిపేట కలెక్టరేట్ లో ల్యాండ్, అట్రాసిటీ కేసులపై నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ వర్గాల అభివృద్ధి కోసం జిల్లాలోని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రభుత్వం మంజూరు చేసే ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను లబ్ధిదారులకు అందేలా చూడాలన్నారు.
జిల్లాలో 2022 నుంచి 2025 వరకు 355 అట్రాసిటీ కేసులు నమోదవగా వాటిలో 328 కేసుల్లో బాధితులకు పరిహారం అందించామని, వివిధ కారణాల వల్ల 27 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. కలెక్టర్ హైమావతి మాట్లాడుతూ జిల్లాలో నమోదయ్యే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారం దిశగా జిల్లా యంత్రంగా కృషి చేస్తోందన్నారు.
2023 నుంచి 2025 వరకు 28 కేసులను కమిషన్ సూచించగా వాటిని దశల వారీగా పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. సీపీ రష్మీ పెరుమాళ్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ కమిషన్‌కు సంబంధించిన అంశాల్లో పోలీస్ శాఖ పూర్తి సహకారం అందిస్తుందన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మెంబర్లు రాంబాబు నాయక్, జిల్లా శంకర్, కొంకటి లక్ష్మీనారాయణ, అడిషనల్ డీసీపీ, ఆర్డీఓలు, ఏసీపీలు, వివిధ శాఖల అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు.
