- సీపీ సాయి చైతన్య
ఆర్మూర్, వెలుగు : మూడో విడత పోలింగ్ జరిగే గ్రామాల్లో పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేశామని సీపీ సాయిచైతన్య తెలిపారు. సోమవారం ఆర్మూర్లో సమీక్షాసమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళిని పాటించాలన్నారు. ఆర్మూర్ డివిజన్ పరిధిలో సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలింగ్జరగాలన్నారు. పోలింగ్ కేంద్రానికి నిర్దిష్ట దూరంలో మార్కింగ్ చేయించి , ప్రచారం, గుర్తులను ప్రదర్శించడం నివారించాలని చెప్పారు.
అవసరాన్ని బట్టి స్ట్రైకింగ్ ఫోర్స్ సేవలను వినియోగించుకొని గుంపులను చెదర గొట్టాలన్నారు. డబ్బు, మద్యం ఇతర వస్తువులు రవాణా కాకుండా అంతర్రాష్ట, అంతర్ జిల్లా సరిహద్దు చెక్ పోస్ట్ లను పక్కాగా తనిఖీలు చేపట్టాలన్నారు. విలేజ్ పోలీసు అధికారులు (వీపీవో) ఆయా గ్రామాలపై నిఘా ఉంచి, ముందస్తు సమాచారాన్ని సేకరించాలన్నారు.
ఎన్నికల రోజు సిబ్బంది తెల్లవారుజామునే తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకుని విధులు నిర్వహించాలన్నారు. విధినిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆర్మూర్ ఏసీపీ జె. వెంకటేశ్వర్ రెడ్డి , ఆర్మూర్ ఎస్హెచ్వో పి. సత్యనారాయణ గౌడ్, ఆర్మూర్ రూరల్ సీఐ కె.శ్రీధర్ రెడ్డి, ఎస్సైలు పాల్గొన్నారు.
