సమ్మె కొనసాగుతుందన్న కాంట్రాక్ట్​ కార్మికులు

సమ్మె కొనసాగుతుందన్న కాంట్రాక్ట్​ కార్మికులు

మందమర్రి, వెలుగు: కాంట్రాక్ట్ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం 18 రోజులుగా సమ్మె చేస్తుంటే కొన్ని సంఘాలు సింగరేణి మేనేజ్​మెంట్​తో తప్పుడు ఒప్పందం చేసుకొని కార్మికుల పొట్ట కొట్టాయని ఐఎఫ్​టీయూ నేషనల్​ లీడర్​ టి.శ్రీనివాస్​, హెచ్ఎంఎస్​ ఏరియా వైస్​ ప్రెసిడెంట్​ పార్వతి ఆరోపించారు. మంగళవారం మందమర్రి మార్కెట్​లో ఐఎఫ్​టీయూ, హెచ్ఎంఎస్​ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్​ కార్మికులు రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా లీడర్లు మాట్లాడుతూ కార్మికులకు వేతనాలు పెంచాలని, ప్రమాదాల్లో చనిపోతే నష్టపరిహారం చెల్లించాలని.. తదితర 18 డిమాండ్ల సాధనకు 18 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నారన్నారు. ప్రధాన డిమాండ్లు పరిష్కారం కాకముందే కొన్ని సంఘాలు సింగరేణి మేనేజ్​మెంట్​తో  లోపాయికారి ఒప్పందం చేసుకొని కార్మికులకు నష్టం చేస్తున్నాయన్నారు. వేతనాలు పెంచేంత వరకు కాంట్రాక్ట్​ కార్మికులు సమ్మెను కొనసాగిస్తారన్నారు. హెచ్​ఎంఎస్​ లీడర్​ వెల్ది సుదర్శన్​ తదితరులు పాల్గొన్నారు. 

బెల్లంపల్లిలో ఏజీఎం ఆఫీస్ ధర్నా

బెల్లంపల్లి, వెలుగు: కాంట్రాక్ట్ కార్మికుల విషయంలో జాతీయ కార్మిక సంఘాలు ఆర్ఎల్సీతో  చేసుకున్న ఒప్పందాన్ని నిరసిస్తూ.. బెల్లంపల్లిలోని సింగరేణి ఏజీఎం ఆఫీస్ ముందు నల్ల జెండాలతో కాంట్రాక్ట్  కార్మికులు ధర్నా నిర్వహించారు. ఐఎఫ్ టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండీ చాంద్ పాషా, జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ సమ్మె ఉధృతంగా సాగుతుండగా జాతీయ కార్మిక సంఘాలు సింగరేణితో కుమ్మక్కై  తప్పుడు ఒప్పందం చేసుకున్నాయని ఆరోపించారు. ధర్నాలో సింగరేణి  కాంట్రాక్ట్ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.బ్రహ్మానందం, కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు.