బడ్జెట్లో చెన్నూర్​ లిఫ్ట్​కు మొండిచేయి

బడ్జెట్లో చెన్నూర్​ లిఫ్ట్​కు మొండిచేయి

మంచిర్యాల,వెలుగు: ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ ​ఎన్నో ఆశలు పెట్టుకున్న చెన్నూర్ లిఫ్ట్​ ఇరిగేషన్​ స్కీంకు రాష్ట్ర ప్రభుత్వం మొండిచేయి చూపించింది. రూ.1,658 కోట్లతో నియోజకవర్గంలోని 90వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూపొంచిందిన ఈ స్కీంకు బడ్జెట్​లో పైసా కేటాయించలేదు. దీంతో సుమన్​కు నిరాశ మిగలగా, నియోజకవర్గ ప్రజలకు మరోసారి ఆశాభంగం తప్పలేదు. 

తలాపునే గోదావరి పారుతున్నా.. 

రూ. లక్ష కోట్లకుపైగా వెచ్చించి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినా నియోజకవర్గానికి సాగునీరు కరువైంది. ఈ క్రమంలో ప్రభుత్వ విప్​, ఎమ్మెల్యే బాల్క సుమన్​ కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల బ్యాక్​ వాటర్​ ఆధారంగా చెన్నూర్​ లిఫ్ట్​ ఇరిగేషన్​ స్కీంను ప్రతిపాదించారు. దీనిద్వారా 90 వేల ఎకరాలను సస్యశ్యామలం చేస్తామని గొప్పగా చెప్పుకుంటున్నారు. నిరుడు సర్వే కోసం రూ. 6.87కోట్లు కేటాయించగా, అందులో ఎన్ని నిధులు విడుదలయ్యాయో తెలియదు. మొత్తానికి సర్వేలు పూర్తయి డీటెయిల్డ్​ ప్రాజెక్ట్​ రిపోర్ట్​ కూడా రెడీ అయినట్టు సమాచారం. ఇక టెండర్​ ప్రక్రియ చేపట్టి వర్క్​ స్టార్ట్​ చేయడమే తరువాయి అన్నంతగా ప్రచారం జరిగింది. త్వరలోనే సీఎం కేసీఆర్​ చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం ఉంటుందని బీఆర్ఎస్​ లీడర్లు చెప్పుకున్నారు. దీంతో నియోజకవర్గ ప్రజలు దశాబ్దాల సాగునీటి కల నెరవేరినట్టేనని భావిస్తున్న తరుణంలో బడ్జెట్​లో ఈ స్కీం ప్రస్తావనే లేకపోవడంతో అధికార పార్టీ లీడర్ల పరిస్థితి కుడితితో పడ్డ ఎలుకలా తయారైంది. ఇగ వచ్చే.. అగ వచ్చే అంటూ ఇన్నాళ్లు ఎంతో ఊదరగొట్టిన లిఫ్ట్​ గురించి ప్రజలకు ఏం సమాధానం చెప్పాలని బిక్కమోహాలు వేస్తున్నారు. ఇది వచ్చే ఎన్నికల్లో బీఆర్​ఎస్​కు నెగటివ్​ అంశంగా మారనుందని ఆందోళన చెందుతున్నారు.  

3 లిఫ్ట్​లు, 10 టీఎంసీలు, 90 వేల ఎకరాలు... 

కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ బ్యాక్​ వాటర్​ నుంచి 10 టీఎంసీల నీటిని తీసుకొని నియోజకవర్గంలోని 90 వేల ఎకరాలకు అందించాలన్నది ప్లాన్​. లిఫ్ట్1 ద్వారా మందమర్రి మండలం పొన్నారం, శంకర్​పల్లి, జైపూర్ మండలంలో గంగిపల్లి ట్యాంక్​ల వరకు, లిఫ్ట్ 2 ద్వారా భీమారం మండలం ఆరెపల్లి, చెన్నూర్ మండలం అస్నాద్, రెడ్డిపల్లి ట్యాంక్​లకు, లిఫ్ట్ 3 ద్వారా కోటపల్లి మండలం శంకర్​పూర్​ ట్యాంక్ వరకు నీళ్లందించేలా దీనిని రూపొందించారు. తద్వారా చెన్నూర్ మండలంలో 31,947 ఎకరాలు, కోటపల్లిలో 22,025, భీమారంలో 10,606,  జైపూర్​లో 19,987, మందమర్రి మండలంలో 5,435 ఎకరాలకు సాగునీరు అందించాలన్నది లక్ష్యం. ఎమ్మెల్యే బాల్క సుమన్ రానున్న ఎన్నికల్లో గెలుపు ఆశల్నీ ఈ లిఫ్ట్​పైనే పెట్టుకున్నారు. రెండేళ్లుగా అధికారులతో రివ్యూలు నిర్వహిస్తూ ఎంతో హడావుడి చేస్తున్నారు. రెండు రోజుల కిందటే కలెక్టర్​ సైతం ఇరిగేషన్​, ఇంజనీరింగ్​ అధికారులతో రివ్యూ మీటింగ్​ ఏర్పాటు చేశారు. భూసేకరణ, లింక్​ చానల్స్​ తదితర అంశాలపై పలు సూచనలు చేశారు. కానీ బడ్జెట్​లో నిధులు కేటాయించకపోవడంతో ఇది ముందుకెళ్తుందా? మరుగున పడుతుందా? అన్న చర్చ మొదలైంది.  

ఇతర ప్రాజెక్టులకు కేటాయింపులు...  

ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాజెక్టుల నిర్వహణ కోసం ఈ బడ్జెట్​లో అరకొర నిధులు కేటాయించారు. ప్రాణహిత–చేవెళ్లకు రూ.101.75 కోట్లు, కడెంకు రూ.83.6 లక్షలు, ఎల్లంపల్లికి రూ.349.43 కోట్లు, లోయర్ పెన్​గంగకు రూ.296 కోట్లు, సుద్దవాగుకు రూ.8.08 కోట్లు, సాత్నాలకు రూ.22.73 కోట్లు, వట్టివాగుకు రూ.3.06 కోట్లు కేటాయించారు. మంచిర్యాల జిల్లాలోని నీల్వాయి ప్రాజెక్టుకు రూ.6.02 కోట్లు, ర్యాలివాగుకు రూ.3 కోట్లు, గొల్లవాగుకు రూ.6.10 కోట్లు కేటాయించారు. నీల్వాయి ప్రాజెక్టు ప్రభావిత గ్రామమైన మామడలో 48 కుటుంబాలకు డబుల్​ బెడ్​రూమ్​ హామీ ఇచ్చినప్పటికీ నిధులు కేటాయించలేదు.