విజృంభిస్తున్న నిఫా వైరస్​.. కేరళలో విద్యార్థి మృతి

విజృంభిస్తున్న నిఫా వైరస్​.. కేరళలో విద్యార్థి మృతి

న్యూఢిల్లీ: కేరళలోని మలప్పురంలో నిఫా వైరస్ తో ఓ స్టూడెంట్(24) మృతి చెందాడు. అతడితో 175 మంది కాంటాక్ట్ కాగా 26 మంది హైరిస్క్  కేటగిరీలో ఉన్నారని ప్రభుత్వం తెలిపింది. ఆ యువకుడి మృతిపై కేరళ ఆరోగ్య మంత్రి వీణాజార్జ్ మాట్లాడారు. ‘‘మలప్పురంలో నిఫా వైరస్ తో  ఓ స్టూడెంట్ మృతి చెందాడు. అతడితో కాంటాక్ట్ అయిన 175 మందిలో 26 మంది హైరిస్క్ కేటగిరీలో ఉన్నారు. ఈ 26 మందిలో 13 మందికి పరీక్షలు చేస్తే నెగెటివ్‌‌ వచ్చింది. వైరస్ సోకినవారిని ఐసోలేషన్ లో ఉంచాం. సహాయం అందిచాలని ఐసీఎమ్ ఆర్ ను అభ్యర్థించాం” అని చెప్పారు. మరణించిన వ్యక్తి మలప్పురంలోని వండూర్ కు చెందినవారు. అతడు సెప్టెంబర్ 9న చనిపోయాడని సమాచారం.

నిఘా పెంచిన తమిళనాడు

నిఫా వైరస్​తో కేరళలో యువకుడు చనిపోయిన విషయం తెలిసి తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. సరిహద్దు జిల్లాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి, ఆరోగ్య బృందాలను 24 గంటల పాటు మోహరించింది.