
పటాన్‌చెరు, వెలుగు : ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఓ స్టూడెంట్ గురుకుల కాలేజీ మూడో అంతస్థు నుంచి కిందపడింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండల పరిధిలోని ముత్తంగి మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల కాలేజీలో శనివారం జరిగింది. న్యాల్‌కల్ మండలం బసంత్‌పూర్‌కు చెందిన మహిపాల్‌రెడ్డి కూతురు అర్చన నెల రోజుల కింద ముత్తంగి గురుకుల కాలేజీలో ఇంటర ఫస్ట్ ఇయర్‌లో జాయిన్ అయింది.
శనివారం తెల్లవారుజామున ఐదు గంటలకు గురుకులం టీచర్లు మహిపాల్‌రెడ్డికి ఫోన్ చేసి అర్చన థర్డ్ ఫ్లోర్ నుంచి పడిపోయిందని, పటాన్‌చెరు ఏరియా హాస్పిటల్‌కు తీసుకెళ్తున్నామని సమాచారం ఇచ్చారు. తర్వాత అక్కడి నుంచి సంగారెడ్డి హాస్పిటల్‌కు తరలించారు. సంగారెడ్డి హాస్పిటల్‌కు చేరుకున్న కుటుంబ సభ్యులకు అర్చనను గాంధీకి తరలించాలని డాక్టర్లు చెప్పడంతో అక్కడికి తీసుకెళ్లారు. అర్చన వెన్నెముకకు తీవ్ర గాయం అయినట్లు డాక్టర్లు చెప్పారు. అయితే అర్చన థర్డ్ ఫ్లోర్ నుంచి ఎలా పడిందో గురుకులం సిబ్బంది చెప్పడం లేదని మహిపాల్‌రెడ్డి తెలిపారు.