ట్రాక్ పై రీల్స్ చేస్తుండగా.. రైలు ఢీకొని హైదరాబాద్ యువకుడు మృతి

ట్రాక్ పై రీల్స్ చేస్తుండగా.. రైలు ఢీకొని హైదరాబాద్ యువకుడు మృతి

ప్రస్తుతం డిజిటల్ ప్రపంచంలో జనాలు స్మార్ట్ ఫోన్ కు బానిసలుగా మారుతున్నారు. ఎలాగైనా ఫేమస్ అయిపోవాలని.. ప్రత్యేకంగా గుర్తింపు పొందాలని ఎక్కడపడితే అక్కడ వీడియోలు, రీల్స్ చేస్తు ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఈ లాంటి సంఘటనే మే 5వ తేదీ శుక్రవారం హైదరాబాద్ చోటుచేసుకుంది. స్నేహితులతో కలిసి రైల్వే ట్రాక్ పై రీల్స్ చేయడానికి వెళ్లిన ఓ విద్యార్థి రైలు ఢీకొని చనిపోయాడు. సనత్ నగర్ సమీపంలోని రైల్యే ట్రాక్ పై ముగ్గురు విద్యార్థులు రీల్స్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.  

రెహమత్ నగర్ లోని శ్రీరామ్ నగర్ మదర్శాలలో చదువుతున్న సర్ఫరాజ్ (16) అనే విద్యార్థి శుక్రవారం మధ్యాహ్నం తన ఇద్దరు స్నేహితులతో కలిసి సనత్ నగర్ రైల్వే ట్రాక్‌లో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేయడానికి వెళ్లాడు. ట్రాక్ వెంట తన ఇద్దరు మిత్రులతో వీడియోలు తీస్తున్న సమయంలో ఆ విద్యార్థిని వెనుక వైపు నుండి రైలు ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు సర్ఫరాజ్. 

సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.. మృతుడు రెహమత్ నగర్‌కు చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. విద్యార్థి ఫోన్ కూడా స్పాట్ నుండి స్వాధీనం చేసుకున్నారు రైల్వే పోలీసులు.  మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రి మార్చురీ తరలించారు. కేసు నమెదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.