
ఇబ్రహీంపట్నం: హాస్టల్లో చదవడం ఇష్టంలేని ఓ విద్యార్థి హాస్టల్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం చెర్లపటేల్ గుడాలోని మహాత్మా జ్యోతీబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్లో హాస్టల్ భవనం రెండవ అంతస్తు నుంచి దూకి ఓ విద్యార్థిని బలవన్మరణానికి యత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
జోగులాంబ గద్వాల జిల్లా మనుపాడు మండలం జల్లాపూర్ కి చెందిన కమ్మరి మీనాక్షి(11)చెర్లపటేల్ గూడలోని మహాత్మా జ్యోతీబాపూలే రెసిడెన్షియల్ స్కూల్లో 6వ తరగతి చదువుతోంది. అయితే తనకు ఇష్టంలేకపోయిన ఆగస్టు5న తల్లిదండ్రులు జాయిన్ చేయడంతో హాస్టల్ లో చదవడం ఇష్టంలేని మీనాక్షి శుక్రవారం ఉదయం హాస్టల్ భవనం రెండవ అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది.
విద్యార్థి మీనాక్షి కుడి కాలు, కుడి చేతి విరిగిపోయింది. మెరుగైన వైద్యంకోసం విద్యార్థిని నగరంలోని ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. పూర్తి వివరాల తెలియాల్సి ఉంది.