డిగ్రీ కాలేజీలో వింత రూల్..రక్తంలో హిమోగ్లోబిన్ 7 శాతం ఉంటేనే అనుమతి లేకపోతే టీసీ

డిగ్రీ కాలేజీలో వింత రూల్..రక్తంలో హిమోగ్లోబిన్ 7 శాతం ఉంటేనే అనుమతి లేకపోతే టీసీ

ఎక్కడైనా  సరిగా చదవకపోతే..  బిహేవియర్ సరిగా లేకపోతే   కాలేజీకి రావొద్దని స్టూడెంట్స్ ను హెచ్చరిస్తారు యాజమాన్యం .  లేకపోతే   ఫీజులు  కట్టకపోతేనో కాలేజీకి అనమతించరు . కానీ రక్తహీనత లోపం ఉన్న విద్యార్థులను కాలేజీకి రావొద్దంటోంది కాలేజీ యాజమాన్యం. అవును వినడానికి వింతగా ఉన్నా  ఇది నిజం.రక్తంలో హిమోగ్లోబిన్ పర్సంటేజ్ తక్కువగా ఉంటే విద్యార్థులకు టీసీ ఇస్తామని కొత్త రూల్ పెట్టింది యాజమాన్యం. ఎక్కడా లేని ఈ వింత రూల్ తో  విద్యార్థులు ఇబ్బందిపడుతున్నారు. 

 కొమరం భీమ్ అసిఫాబాద్ జిల్లా బూరుగు గూడలో గిరిజన డిగ్రీ కాలేజీలో ఉన్న ఈ వింత రూల్ విద్యార్థులకు ఇబ్బందిగా మారింది. రక్తహీనత లోపం ఉన్న విద్యార్థులను కాలేజీకి అనుమతించడం లేదు . 7 గ్రాముల కంటే తక్కువ హిమోగ్లోబిన్ ఉంటే రానివ్వడం లేదు. బ్లడ్ టెస్ట్ చేసి విద్యార్థులకు టీసీలు ఇస్తున్నారు. ఇటీవల  ఇద్దరు విద్యార్థినీలు కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నారు. అయితే ఇందులో ఓ విద్యార్థికి బ్లడ్ టెస్ట్ చేస్తే హిమోగ్లోబిన్ 3.2 గ్రాములుగా ఉంది.   రక్తహీనత  సాకుతో  ఇద్దరు విద్యార్థినిలకు  టీసీలు ఇస్తామని గిరిజన   డిగ్రీ  కళాశాల అధికారులు చెప్పడంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. 

అంతేగాకుండా విద్యార్థినిలతో  కాలేజీ అధికారులు  లేఖలు రాయించుకోవడం కలకలం రేపుతోంది. కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతోన్న కల్పన అనే విద్యార్థినితో  కాలేజీ యాజమాన్యం రాయించిన  లేఖ ఇపుడు వైరల్ గా మారింది.  ప్రైవేట ఆస్పత్రిలో బ్లడ్ టెస్ట్  చేయించుకుంటే  హిమోగ్లోబిన్ 3.2 గ్రాములు ఉంది. 7 గ్రాముల రక్తం ఉంటేనే కాలేజీకి వస్తాను. దీనికి మా తల్లిదండ్రులది బాధ్యత. వారు  కూడా ఒప్పుకున్నారు. దీనికి కాలేజీ యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. అని లేఖలో రాయడం చర్చనీయాంశంగా మారింది.

 కాలేజీలో ఉన్న ఈ వింత రూల్ పై అటు విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ఈ వింత రూల్ ను తొలగించాలని .. ఇదేం రూల్ అని ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.