కౌడిపల్లి, వెలుగు : పెద్ద వాన పడితే.. ఆ తండా విద్యార్థులు స్కూల్ కు బంద్. ఒకవేళ వెళ్లాలనుకుంటే మోకాళ్లలోతు చెరువు నీళ్లలోంచి దాటేందుకు సాహసించాలి. ఇలాంటి పరిస్థితి మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం మహమ్మద్ నగర్ పంచాయతీ పరిధి వస్రాం తండాలో నెలకొంది. తండాకు చెందిన 11 మంది విద్యార్థులు ఒకటి నుంచి టెన్త్ క్లాస్ వరకు సమీపంలోని కన్నారం ప్రైమరీ, జెడ్పీ హైస్కూల్చదువు తున్నారు. స్కూల్ కు వెళ్లాలంటే చెరువు నీళ్లను దాటాలి. లేదంటే ఇంటివద్దనే ఉండాలి. చెరువు పూర్తిగా నిండనప్పుడు ఏ ఇబ్బంది ఉండదు.
భారీ వర్షాలు కురిసి నిండితే మాత్రం నడుముల్లోతు నీళ్లల్లోంచి పోవాలి. హైస్కూల్ విద్యార్థులు ఎలాగోలా ఇబ్బందులు పడుతూ వెళ్తుండగా.. చిన్న పిల్లలను తల్లులు, కుటుంబసభ్యులు ఎత్తుకుని భయం భయంగా చెరువు దాటుతారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఇలాంటి ఇబ్బందులు తప్పవు. చాలా ఏండ్లుగా ఇలాంటి సమస్య ఉండగా.. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఎవరూ పట్టించుకోడం లేదని తండావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి తమ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని గిరిజనులు కోరుతున్నారు.