సంక్షేమ హాస్టళ్లలో ఆకలి కేకలు

సంక్షేమ హాస్టళ్లలో ఆకలి కేకలు
  • కుళ్లిన కూరగాయలు ముక్కిన బియ్యం
  • తినలేక ఉపాసముంటున్న పిల్లలు..సంక్షేమ హాస్టళ్లలో ఆకలి కేకలు
  • ఐదేండ్లుగా మెస్​చార్జీలు పెంచని సర్కారు.. తగ్గుతున్న క్వాలిటీ, క్వాంటిటీ 

మంచిర్యాల/ నెట్​వర్క్​, వెలుగు:  సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో విద్యార్థులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. చాలాచోట్ల అన్నంలో పురుగులు, రుచిలేని కూరలు వడ్డిస్తుండడంతో  ఫుడ్​ పాయిజనింగ్​ జరిగి విద్యార్థులు హాస్పిటల్​ పాలవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు హాస్టళ్లు, గురుకులాలను ‘వెలుగు’ టీమ్​ గురువారం విజిట్​ చేయగా చాలాచోట్ల ముక్కిన బియ్యం, కుళ్లిన కూరగాయలు, నాణ్యత లేని సరుకులు బయటపడ్డాయి. అన్ని ఐటమ్స్​ తక్కువగా వండుతుండడంతో పిల్లలకు సరిపోవట్లేదని తేలింది. బయట టిఫిన్​ చేయాలంటే50 రూపాయలకు తక్కువ లేదు.. కానీ సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో చదువుతున్న స్టూడెంట్స్​కు ఒక్కొక్కరికి 30, 40 రూపాయల్లోనే రోజూ మార్నింగ్​ బ్రేక్​ఫాస్టూ, మధ్యాహ్నం లంచ్​, రాత్రికి డిన్నర్​, వారంలో ఒక రోజు మటన్, రెండురోజులు చికెన్​, మూడురోజులు గుడ్డు, మూడు అరటిపండ్లు పెట్టాలంటోంది సర్కారు. రోజురోజుకూ నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నా అందుకు తగ్గట్టుగా మెస్​చార్జీలను మాత్రం పెంచట్లేదు. 

ఐదేండ్ల కింద నిర్ణయించిన రేట్లనే ఇప్పటికీ చెల్లిస్తుండడంతో అధికారులు మెనూలో కోతలు పెడుతున్నారు. ఆహారంలో క్వాలిటీ, క్వాంటిటీ తగ్గించి సర్దుబాటు చేస్తున్నారు. ఫలితంగా విద్యార్థులు కడుపులు మాడ్చుకుంటున్నారు. అన్నిట్లో కోత ప్రభుత్వం మెస్​చార్జీలు పెంచకపోయినా ఏటా పెరిగిన ధరలకు తగ్గట్టుగా కాంట్రాక్టర్లకు టెండర్లు ఇస్తారు. దీంతో వారు సప్లై చేసే సరకుల క్వాంటిటీ తగ్గిపోతున్నది. పప్పులు చాలకపోవడంతో సాంబారు, చారుతో సర్దుబాటు చేస్తున్నారు. నెలలో నాలుగుసార్లు చికెన్​, రెండుసార్లు మటన్​ వడ్డించాలి. పూటకు 100 గ్రాములకు గాను 60 నుంచి 70 గ్రాములు మాత్రమే పెడుతున్నారు. ఐదు రోజులు ఎగ్స్​ పెట్టాల్సి ఉండగా, ఒక్కోరోజు తప్పిస్తున్నారు. 200 గ్రాముల కూరగాయలకు గాను 100 గ్రాములకు మించి పెట్టే పరిస్థితి లేదు. డెయిలీ సీజనల్​ ప్రూట్స్​ ఇవ్వాల్సి ఉండగా, కొన్నిచోట్ల ఐదు రోజులే ఇస్తున్నారు. చాయ్​, పెరుగు, స్నాక్స్​ కలిపి 150 గ్రాముల పాలు, రోజుకు 20 గ్రాముల ఆయిల్​తోనే సరిపెడుతున్నారు. మెస్​ స్టోర్​లో ఉండే 50 నుంచి 60 రకాల సరుకులు అన్నీ గ్రాముల్లోనే అందిస్తున్నారు. పప్పు తగ్గితే సాంబారు... ఇంకా తగ్గితే చారు.. నెలలో నెయ్యి మాయం.. ఒక రోజు మటన్ మాయం.. రెండుసార్లు చికెన్​ మాయం.. వారంలో మూడు గుడ్లు మాయం.. మూడు అరటి పండ్లు మాయం.. పెరుగు మజ్జిగయ్యింది అన్నట్లుగా హాస్టళ్లలో పరిస్థితి తయారైంది. 

ఏ చోట చూసినా..రాష్ట్రవ్యాప్తంగా పలు హాస్టళ్లు, గురుకులాలను గురువారం ‘వెలుగు’టీమ్​ విజిట్​ చేయగా పలు విషయాలు బయటపడ్డాయి. కరీంనగర్​ జిల్లా చొప్పదండిలోని సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్​కు తుట్టెలు కట్టిన, పురుగులు ఉన్న బియ్యం సప్లై అయ్యాయి. ఇక్కడ 480 మంది స్టూడెంట్స్ కు  రోజుకు 140కిలోల బియ్యం వండాల్సి ఉంటుంది. ఇటీవలి ఘటనల నేపథ్యంలో అలర్ట్​ అయిన ప్రిన్సిపల్ ఐదుగురు కూలీలను పెట్టి బియ్యాన్ని క్లీన్ చేయించి వండిస్తున్నారు. బియ్యాన్ని క్లీన్ చేయించినప్పుడల్లా రూ. 2వేలు ఖర్చవుతోందని, ఇది అదనపు భారంగా మారిందని ఆయన వాపోయారు. గురువారం సప్లై అయిన కూరగాయలు నాసిరకంగా ఉన్నాయి. బెండకాయలు ముదిరిపోగా, ఆనిగపుకాయలు, పచ్చి మిర్చి, క్యాబేజీ బాగ లేవు. మైదాపిండిలో కూడా పురుగులు వస్తున్నాయని  వంటవాళ్లు చెప్పారు. 

ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాల, వైరా బీసీ గురుకుల పాఠశాల ఒకే ప్రైవేట్ బిల్డింగ్ లో ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం 600 మంది స్టూడెంట్స్ ఉన్నారు. కూరగాయల కాంట్రాక్టర్​ కుల్లిన టమాటాలు, పండిపోయిన దొండకాయలు, పాడైన దోసకాయలు సప్లై చేశారు. అన్ని రకాల కూరగాయలు కిలోకు రూ.13 లకే ఇస్తామని కాంట్రాక్ట్ తీసుకున్నారు. ఆ రేటుకు క్వాలిటీ సరుకు దొరికే అవకాశం లేక నాసిరకం కూరగాయలు సప్లై చేస్తున్నారు. తిరుమలాయపాలెం గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల, జూనియర్ కాలేజీలో కూడా అలాగే ఉంది. కిచెన్​ శుభ్రంగా లేక ఈగలు ముసురుతున్నాయి.  

మెదక్ జిల్లా వెల్దుర్తి  బీసీ బాయ్స్ హాస్టల్ లో 72 మంది స్టూడెంట్ ఉన్నారు. కొన్ని రోజుల నుంచి అన్నంలో పురుగులు వస్తున్నాయని స్టూడెంట్స్​ ఆరోపించారు. ‘వెలుగు’ విజిట్​లోనూ ఇదే విషయం బయటపడింది. బియ్యం శుభ్రం చేయకుండా వండుతున్నందునే  ఈ పరిస్థితి వచ్చింది.మహబూబ్ నగర్​లోని అన్ని హాస్టళ్లలో, గవర్నమెంట్ స్కూళ్లలో దొడ్డు బియ్యంతో వండిన అన్నం పెడుతున్నారు. మూడు రోజుల కింద సన్న బియ్యం స్టాక్ వచ్చినా.. నిరుడు వచ్చిన దొడ్డు బియ్యమే వాడుతున్నారు. స్థానిక రాంనగర్​లోని హైస్కూల్​లో గురువారం కూడా  వంట ఏజెన్సీ నిర్వాహకులు దొడ్డు బియ్యం, నీళ్ల పప్పు వండారు. మోడల్ బేసిక్ హైస్కూల్​లో దొడ్డు బియ్యంతో బగారా,  టమాటా చట్నీ వండారు. పక్కనే ఉన్న మోడల్ బేసిక్ ప్రైమరీ స్కూల్​లో  దొడ్డు  అన్నం, టమాటా కర్రీతో సరిపెట్టారు.

నల్గొండ జిల్లా నకిరేకల్ లోని బీసీ బాయ్స్​ హాస్టల్ లో ఉదయం స్డూడెంట్స్​కు సరిపడా​ బ్రేక్​ఫాస్ట్​ పెట్టలేదు. గురువారం ఉదయం టిఫిన్​గా ఉప్మా పెట్టారు. మొదటిసారి కొద్దిగానే పెట్టడంతో అదిసరిపోక మళ్లీ వడ్డించుకునేందుకు వెళ్తే వండిన ఉప్మా అప్పటికే అయిపోయింది. పిల్లలు అర్ధాకలితో స్కూలుకు వెళ్లారు. మొత్తం 45 మంది స్టూడెంట్స్​ ఉండగా నాలుగు కేజీల ఉప్మా, కొద్దిగాసాంబారు మాత్రమే చేశారు. ‘వెలుగు’ వెళ్లినప్పుడు హాస్టల్ వార్డెన్ అందుబాటులో లేరు. 

సూర్యాపేటలోని బీసీ (బి)-బాయ్స్ హాస్టల్ లో  కుళ్లిపోయిన కూరగాయలతో వంట చేస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. రెండురోజుల కింద హాస్టల్​ను సందర్శిచిన పీడీఎస్ యూ, ఎస్ఎఫ్​ఐ లీడర్లు.. కుళ్లిపోయిన కూరగాయలు వండడాన్ని చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్డెన్ ను  సస్పెండ్ చేయాలని, కాంట్రాక్టర్  లైసెన్స్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ హాస్టల్ ముందు రెండు గంటల పాటు ఆందోళన చేశారు. ఆదిలాబాద్ లోని కొలాం గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్​తయారీ కోసం 2019లో రూ. లక్షన్నర పెట్టి కొనుగోలు చేసిన రైస్​ స్టీమర్స్​ మూలపడ్డాయి. ఆరు నెలలు వాడిన తర్వాత రిపేర్ కు రావడంతో ఆఫీసర్లు పట్టించుకో లేదు. దీంతో ఎప్పట్లాగే మామూలుగా వండుతుండడంతో అన్నం మెత్తపడుతున్నది.

మిడ్​డే మీల్స్​దీ ఇదే పరిస్థితి

రాష్ట్రంలోని సర్కారు స్కూళ్లలో అమలుచేస్తున్న మిడ్​డే మీల్స్​దీ ఇదే పరిస్థితి. మధ్యాహ్న భోజనం వండి వడ్డించే బాధ్యతను ప్రైవేట్ ఏజెన్సీలకు ప్రభుత్వం అప్పగించింది.  ప్రైమరీ స్కూళ్లలో ఒక్కో స్టూడెంట్​కు రూ.4.97 చొప్పున, హై స్కూళ్లలో రూ.7.45 చొప్పున చెల్లిస్తున్నది. పెరుగుతున్న నిత్యావసరాల ధరలకు తగ్గట్టుగా మీల్స్​ రేట్లు సవరించాలని కొన్నేండ్లుగా ఏజెన్సీలు డిమాండ్​ చేస్తున్నాయి.  ప్రైమరీ స్కూల్​లో  ఒక్కో స్టూడెంట్​కు రూ.10, హై స్కూల్​లో రూ.13 చొప్పున చెల్లించాలని అడుగుతున్నాయి. కానీ ప్రభుత్వం ఈ డిమాండ్లను పట్టించుకోకపోవడంతో కూరల క్వాంటిటీ, క్వాలిటీ తగ్గిస్తున్నాయి.

దొడ్డు బియ్యమే దిక్కు!

హాస్టల్స్​, గురుకులాల్లో ఉండి చదువుకునే  స్టూడెంట్స్​కు సన్నబియ్యంతో అన్నం పెడ్తామని సర్కారు గొప్పగా ప్రకటించింది. కానీ ప్రస్తుతం అన్నిచోట్లా దొడ్డు బియ్యమే దిక్కవుతున్నది.  హాస్టళ్లకు ఎంఎల్ఎస్(మండల్​ లెవల్ ​స్టాక్​) పాయింట్స్ నుంచి కొన్నాళ్లుగా ముక్కిన, పురుగు పట్టిన బియ్యం సప్లై చేస్తున్నారు. హాస్టళ్లలో స్టాఫ్​ తక్కువగా ఉండడంతో బియ్యాన్ని శుభ్రం చేయకుండానే వండి.. పిల్లలకు వడ్డిస్తున్నారు. రైస్ మిల్లుల నుంచి ఎంఎల్ఎస్ పాయింట్స్ కు వచ్చే బియ్యాన్ని క్వాలిటీ కంట్రోల్ ఇన్​స్పెక్టర్లు, టెక్నికల్ అసిస్టెంట్ చెక్ చేయాలి. కానీ చాలాచోట్ల క్వాలిటీ కంట్రోల్  ఇన్​స్పెక్టర్​, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఔట్ సోర్సింగ్ సిబ్బందిని  నియమించి పని కానిచ్చేస్తున్నారు. నాసిరకం బియ్యం సప్లై చేస్తున్న మిల్లర్లు.. క్వాలిటీ కంట్రోల్​ సిబ్బందిని మేనేజ్​ చేస్తున్నారు. మిల్లర్ల నుంచి ఒక్కో లారీకి రూ.500 నుంచి 1,000 వరకు కమీషన్​ తీసుకుని  బియ్యాన్ని చెక్ చేయకుండానే పాస్​ చేస్తున్నా రనే ఆరోపణలు ఉన్నాయి.

ఐదేండ్లుగా పెరగని మెస్ ​చార్జీలు  

రాష్ట్ర ప్రభుత్వం 20 17-18 విద్యాసంవత్సరంలో మెస్​చార్జీలను చివరిసారి పెంచింది. గత ఐదేండ్లుగా అవే చార్జీలను చెల్లిస్తున్నది. ప్రస్తుత మార్కెట్​ ధరలతో పోల్చుకుంటే ఇవి ఏ మూలకూ సరిపోవడం లేదు. 2017కు ముందు 3 నుంచి 7వ తరగతి వరకు రూ.750 ఉన్న మెస్​చార్జీని రూ.950కి.. 8, 9, 10 తరగతులకు రూ.850 నుంచి రూ.1,100కి.. ఇంటర్​, డిగ్రీ విద్యార్థులకు రూ.1,050 నుంచి రూ.1,500కు పెంచింది. గత ఐదేండ్లుగా ఏటా నిత్యావసరాల ధరలు పెరుగుతున్నా మెస్​చార్జీలను మాత్రం ప్రభుత్వం పెంచడంలేదు. తరగతులను బట్టి ఒక్కో స్టూడెంట్​కు రోజుకు రూ.30 నుంచి రూ.50 మాత్రమే చెల్లిస్తున్నది. ఇందులోంచే గ్యాస్​కు రూ.5 పోతాయి. బయట ఒక్కపూట బ్రేక్​ఫాస్ట్​, చాయ్​కే రూ.50 ఖర్చవుతాయి. కానీ విద్యార్థులకు మార్నింగ్​ బ్రేక్​ఫాస్ట్​, మధ్యాహ్నం లంచ్​, సాయంత్రం స్నాక్స్​, నైట్​ డిన్నర్​ అందించాల్సిన పరిస్థితి.