స్టూడెంట్లపై సీనియర్ల దాడి

స్టూడెంట్లపై సీనియర్ల దాడి
  • సోషల్​ వెల్ఫేర్​ గురుకులంలో ఘటన

జడ్చర్ల టౌన్, వెలుగు: మహబూబ్​నగర్​ జిల్లా జడ్చర్లలోని పోచమ్మ తండా సోషల్​వెల్ఫేర్​ గురుకులంలో జూనియర్లపై సీనియర్​ స్టూడెంట్లు దాడి చేయడం కలకలం రేపింది. విషయం తెలుసుకున్న బాధిత స్టూడెంట్ల పేరెంట్స్​ స్కూల్​కు చేరుకొని ఆందోళనకు దిగారు. బుధవారం రాత్రి తమను ఇంటర్​ చదువుతున్న స్టూడెంట్స్​ చితకబాదారని 13 మంది టెన్త్​ స్టూడెంట్స్​ వాపోయారు. ఆ సమయంలో వారు మద్యం తాగి ఉన్నాయని ఆరోపించారు. 

తమకు ఎదురు తిరుగుతున్నారని, అడిగిన దానికి సరిగా సమాధానం ఇవ్వడం లేదని, తాము సీనియర్లం తమకే ఎదురు మాట్లాడతారా? అంటూ కొట్టారని వాపోయారు. ఇదిలాఉంటే గాయాలపాలైన విద్యార్థులు తమ పేరెంట్స్​కు సమాచారం ఇవ్వడంతో గురువారం గురుకులానికి చేరుకొని ఆందోళనకు దిగారు. తమ పిల్లల గాయాలను ఆఫీసర్లకు చూపించి వారిని నిలదీశారు. దాడి చేస్తుంటే మీరేం చేశారని ప్రిన్సిపాల్, సిబ్బందిని నిలదీశారు. 

ఈ ఘటనపై ప్రిన్సిపాల్  శ్రీధర్ రావు పోలీసులకు సమాచారం అందించారు. స్కూల్​కు వచ్చిన పోలీసులు దాడికి పాల్పడిన స్టూడెంట్లను మందలించి కౌన్సెలింగ్ ఇచ్చారు. టీచర్ల నిర్లక్ష్యం వల్లే తమ పిల్లలు గాయపడ్డారని పేరెంట్స్​ ఆవేదన వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రిన్సిపాల్ తో పాటు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.