టీచర్లు లేరు.. ఇకంతా మా ఇష్టమే

టీచర్లు లేరు..  ఇకంతా మా ఇష్టమే
  • ‘నిష్ఠ’ ట్రైనింగ్‍ కు వెళ్లిన ఉపాధ్యాయులు
  • టీచర్ల అవతారం ఎత్తిన విద్యార్థులు

గ్రేటర్‍ పరిధిలోని టీచర్లు ‘నిష్ఠ’ ట్రైనింగ్​కు వెళ్లడంతో విద్యార్థులే టీచర్ల అవతారం ఎత్తారు. ఒకే టీచర్‍ రెండు, మూడు తరగతుల విద్యార్థులను కలిపి ఆరు బయట కూర్చొబెట్టారు. మొదటి రోజు స్కూళ్లలో ఉన్న టీచర్లు విద్యార్థులను కంట్రోల్‍ చేసేందుకే సరిపోయింది. ప్రైమరీ, హై స్కూల్‍ కలిసి ఉన్న వాటిల్లో విద్యార్థులను కంట్రోల్‍ చేసేందుకు బాగా కష్టపడ్డారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ట్రైనింగ్‍కు పంపాలని జిల్లా ఉన్నతాధికారులు డిప్యూటీ ఈఓలకు ఆదేశాలు జారీ చేశారు. కానీ చాలా స్కూళ్లలో ఈ ఆదేశాలు అమలు కాలేదు. 50 శాతం టీచర్లు ఉండాలని అధికారులు ఇచ్చిన ఆదేశాలు బుట్టదాఖలయ్యాయి. హైదరాబాద్‍ జిల్లా పరిధిలోని 16 మండలాల్లోని చాలా స్కూళ్లలో 50 శాతానికిపైగా టీచర్లు నిష్ఠ ట్రైనింగ్‍కు పోయినట్లు ‘వెలుగు’ పరిశీలనలో తెలిసింది. గవర్నమెంట్‍, ఎయిడెడ్‍ టీచర్లకు కలిపి 2 స్పెల్‍లో ట్రైనింగ్‍ ఇస్తున్నట్లు దాంతో ఒకే స్కూల్‍ నుంచి ఎక్కువ మందికి ట్రైనింగ్‍ షెడ్యూల్‍ పడి ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ప్రతి స్కూల్‍లో 50 శాతం మంది టీచర్లు ఉండేలా ప్లాన్‍ చేస్తున్నామన్నారు. టీచర్లకు ట్రైనింగ్‍ ఇచ్చేందుకు ఆలోచన చేశారేగాని, అదే సమయంలో స్కూల్స్ ఎలా నడుస్తాయో ఆలోచన చేయలేదని విద్యావేత్తలు అభిప్రాయబడ్డారు. రెండో విడత ట్రైనింగ్​కైనా ఇలాంటి పొరబాట్లు జరగకుండా చూడాలని కోరుతున్నారు.

 Students become teachers as teachers move to nishtha training