టీచర్ బదిలీపై విద్యార్థుల కన్నీటి పర్యంతం

టీచర్ బదిలీపై విద్యార్థుల కన్నీటి పర్యంతం

మన జీవితంలో తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుదే. తల్లిదండ్రులు జన్మనిస్తే..గురువులు ఆ జన్మను సార్థకం చేసుకోవడానికి అవసరమైన దారులు వేస్తారు. జీవితంలో జీరో  స్థాయి నుంచి హీరో స్థాయికి చేరుకోవడంలో గురువుల పాత్ర వెలకట్టలేనిది. పాఠాలతో పాటు...జీవిత పాఠాలు నేర్పుతూ..మన ఎదుగుదలలో ఎప్పటికీ తోడుంటారు. అలాంటి టీచర్లు స్కూల్ నుండి బదిలీ అయితే ఆ విద్యార్థుల బాధ వర్ణణాతీతం. ఉపాధ్యాయుడు పాఠశాల నుంచి ట్రాన్స్ ఫర్ అయి వెళ్తుంటే ..వెళ్లొద్దంటూ విద్యార్థులు కన్నీరుమున్నీరవుతుంటారు. అలాంటి ఘటనే  ఉత్తరప్రదేశ్‌  రాష్ట్రంలోని చందౌలీ జిల్లాలో జరిగింది. 

విద్యార్థుల భావోద్వేగం..
చందౌలీ జిల్లాలోని కాంపోజిట్ స్కూల్‌లో శివేంద్ర సింగ్ బఘెల్ అనే ఉపాధ్యాయుడు నాలుగేళ్ల క్రితం ఈ పాఠశాలకు బదిలీ అయి వచ్చాడు. అతను 2018  సెప్టెంబర్ 7 నుంచి 2022 జూలై 12 వరకు స్కూళ్లో పాఠాలు బోధించాడు. ఈ నాలుగేళ్లలో విద్యార్థులను కన్న బిడ్డలుగా చూసుకున్నాడు. వారితో స్నేహితుడిగా కలిసిపోయాడు. దీంతో శివేంద్ర సింగ్ అంటే విద్యార్థులకు విపరీతమైన ఇష్టం, గౌరవం ఏర్పడింది. అయితే ఇటీవల అతను మరో స్కూల్కు బదిలీ అయ్యాడు. ఈ నేపథ్యంలో స్కూళ్లో ఫెర్వల్ సమావేశం ఏర్పాటు చేశాడు. ఈ సమయంలో విద్యార్థులు భావోద్వేగానికి లోనయ్యారు. తమను విడిచి వెళ్లొద్దంటూ కన్నీరుమున్నీరయ్యారు. 

వెళ్లొద్దంటూ ..
పాఠశాలను విడిచి శివేంద్ర సింగ్ బఘెల్ వెళ్తుంటే విద్యార్థులు వెంట వచ్చారు. విద్యాబుద్దుల నేర్పిన టీచర్ కు వీడ్కోలు పలకలేక విద్యార్థులు వెక్కివెక్కి ఏడ్చారు. గురువుగా...స్నేహితుడిగా ఇన్నాళ్లు తమతో..తమలో తమవాడై మెలిగిన ఉపాధ్యాయుడిని వదిలిపెట్టలేక చిన్నారులు కంటతడి పెట్టారు. తమ ఫెవరెట్ టీచర్ కు ఫేరవల్ చెప్పలేక విద్యార్థులు విలపించారు. వెళ్లొద్దంటూ టీచర్ ను చుట్టుముట్టారు. బాగా చదువుకోండి మళ్లీ వస్తానని శివేంద్ర సింగ్ చెప్పినా విద్యార్థులు వినలేదు. అప్పుడప్పుడు చూడటానికి వస్తానని చెప్పినా కూడా అతన్ని విద్యార్థులు వదల్లేదు. చివరకు తప్పని పరిస్ధితుల్లో  గ్రామ పొలిమేరల వరకు టీచర్ తో నడుచుకుంటూ వెళ్లి వీడ్కోలు పలికారు. 

కంటతడి పెట్టిన టీచర్..
విద్యార్థుల ప్రేమకు, అభిమానానికి శివేంద్ర సింగ్ బఘెల్ ఫిదా అయిపోయాడు. విద్యార్థులు ప్రేమను చూసి అతను కంటతడి పెట్టాడు. స్కూల్లో చదువుతో పాటు విద్యార్థులతో సరదాగా గడిపేవాడినని శివేంద్ర బఘేల్  చెప్పాడు. పిల్లల నుంచి ఎంతో ప్రేమను పొందానని..ఈ ప్రేమ వెలకట్టలేనదన్నాడు. 

స్కూల్లో ఎంత మంది టీచర్లున్నా...పిల్లలకు నచ్చే..మెచ్చే టీచర్లు కొంత మందే ఉంటారు. వారి పట్ల గౌరవం, ప్రేమను పెంచుకుంటారు. ఆ ఉపాధ్యాయుడు చెప్పిన మాటలను సక్రమంగా పాటిస్తూ చదువులోనూ రాణిస్తారు. అలాంటి టీచర్ స్కూల్ ను వదిలి వేరేచోటుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే మాత్రం విద్యార్థులు తట్టుకోలేరు.