చదువు బరువు మోయలేక.. ప్రాణాలు తీసుకుంటున్నరు

చదువు బరువు మోయలేక.. ప్రాణాలు తీసుకుంటున్నరు

కార్పొరేట్‌‌ కాలేజీల ఒత్తిడి తట్టుకోలేకపోతున్న స్టూడెంట్లు

మార్కులు, ర్యాంకులే లక్ష్యంగా కార్పొరేట్ కాలేజీలు
ఉదయం 4 నుంచి రాత్రి 11 గంటల దాకా చదువుడే
స్టూడెంట్స్‌కు ఆటల్లేవ్ .. సెలవుల్లేవ్
ఒత్తిడిని తట్టుకోలేక పారిపోతున్న స్టూడెంట్స్
పదిరోజుల్లోనే ఆరుగురు ఆత్మహత్య
కాలేజీల్లో కనిపించని కౌన్సెలర్లు

పరీక్షలు దగ్గరపడుతున్నాయని రోజూ 18 గంటలు చదివిస్తున్నరు . రాత్రి 11 గంటల వరకు చదవడమే. పొద్దున్నే 4 గంటలకు లేచి
మళ్లీ చదవడమే. నిద్ర సరిగ్గా ఉండట్లేదు. ఎక్కువ తింటే నిద్రొస్తదని తిండి కూడా సరిగ్గా తినట్లేదు . పరీక్షల టైం దగ్గరికొస్తున్నకొద్దీ టెన్షన్ పెరుగుతున్నది.” .. ఇదీ హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న స్టూడెంట్ ఆవేదన.

‘‘ఇంటర్ ఎంపీసీ ఫస్టియర్‌లో నాకు 460 మార్కులు వచ్చినయ్. మా కాలేజీ టాపర్‌ను నేనే. సెకండియర్ ఎగ్జామ్స్‌లో అంతకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని మా లెక్చరర్లు, పేరెంట్స్ టార్గెట్ పెట్టిండ్రు. దాని కోసం కష్టపడాల్సి వస్తది.’’ … ఇదీ ఖమ్మం జిల్లాకు చెందిన ఓ స్టూడెంట్ వేదన.

కార్పొరేట్ , ప్రైవేటు కాలేజీల్లో స్టూడెంట్స్ ఎంత మానసిక ఒత్తిడికి గురవుతున్నారో చెప్పడానికి ఈ ఇద్దరి అభిప్రాయాలు మచ్చుకు మాత్రమే. కోడి కూయకముందే నిద్రలేచి.. అర్ధరాత్రి వరకు చదవడం, చదవడం, చదవడం.. ఇదే పని. ఆ ఒత్తిడికి, వేళాపాలా లేని
ఆ స్టడీ అవర్స్‌కు చిట్టి గుండెలు బరువెక్కుతున్నాయి. గడిచిన వారం పదిరోజుల్లోనే ఆరుగురు ఇంటర్ స్టూడెంట్స్ చనిపోయారు. ఈ చదువులు తమ వల్ల కాదని చాలా మంది స్టూడెంట్స్ కాలేజీలు విడిచి పారిపోయారు.

హైదరాబాద్​, వెలుగు: మానసిక ఒత్తిడికి, ఆత్మహత్యలకు కార్పొరేట్ ఎడ్యుకేషన్​ ఇన్​స్టిట్యూట్లు కేరాఫ్  అడ్రస్​గా మారుతున్నాయి. వారం పదిరోజుల్లోనే ఆరుగురు ఇంటర్​ స్టూడెంట్స్​ చనిపోయారు.  ఈ చదువులు తమ వల్ల కాదని చాలా మంది స్టూడెంట్లు కాలేజీలు విడిచి పారిపోయారు. మరో వారంలో ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానుండటంతో స్టూడెంట్స్​ మరణాలు  పేరెంట్స్​ను కలవరపెడుతున్నాయి. కార్పొరేట్, ప్రైవేటు కాలేజీలు మార్కులు, ర్యాంకులే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. టెన్త్​ మార్కుల ఆధారంగా ఆయా కాలేజీలు బ్యాచులుగా మార్చి, ఒకే గ్రూప్ అయినా వేర్వేరుగా స్టూడెంట్స్​కు  క్లాసులు చెప్తున్నాయి. ఒక్కో బ్యాచ్​కు ఒక్కో రకమైన ఫీజులను గుంజుతున్నాయి. ఉదయం 4 గంటల నుంచి రాత్రి 11గంటల వరకు క్లాసులు, హోం వర్క్​, ప్రిపరేషన్​ అంటూ స్టూడెంట్స్​ను యంత్రాలుగా మార్చేస్తున్నారు. అధికారికంగా ఆదివారాలు, పండుగలకు సెలవులున్నా.. కార్పొరేట్ కాలేజీల్లో మాత్రం అవేవీ ఉండవు. ఆదివారం అది కూడా కొందరు స్టూడెంట్స్​కే  ఒక గంట మాత్రమే కాలేజీ నుంచి ఔటింగ్​ ఇస్తుంటారు. ఈ ఏడాది దసరా సెలవుల్లోనూ యథేచ్ఛగా కార్పొరేట్ కాలేజీలు క్లాసులు నిర్వహించాయి. కొందరు స్టూడెంట్స్​, యూనియన్లు ఫిర్యాదు చేస్తే, ఆయా కాలేజీలకు మొక్కుబడిగా అధికారులు నోటీసులు ఇచ్చి, ఫైన్లు వసూలు చేశారు.

నిద్రొస్తదని సరిగ్గా తినడం లేదు

ఎగ్జామ్స్​ సీజన్​ నడుస్తుండటంతో స్టడీ అవర్స్​ను కార్పొరేట్​ కాలేజీలు మరింత పెంచాయి. స్టడీ అవర్స్​ ఎక్కువ కావడంతో నిద్ర సరిగ్గా ఉండటం లేదని, ఎక్కువ తింటే నిద్రొస్తుందని తిండి కూడా సరిగ్గా తినడం లేదని స్టూడెంట్స్​ అంటున్నారు. పరీక్షల టైం దగ్గరికొస్తున్నకొద్దీ టెన్షన్​ పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒత్తిడి తాళలేక పారిపోతున్నరు. పొద్దస్తమానం చదవడం, సెలవులు లేకపోవడం, కనీసం ఆటపాటలకు కూడా అవకాశం లేకపోవడంతో స్టూడెంట్స్​ మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఈ క్రమంలో కొందరు స్టూడెంట్స్​ కాలేజీ నుంచి పారిపోతున్నారు.  విద్యాసంవత్సరం ప్రారంభంలోనే ఒత్తిడి తట్టుకోలేక కార్పొరేట్ కాలేజీల నుంచి  సుమారు పది శాతంమంది స్టూడెంట్స్​ పారిపోయినట్లు పేరెంట్స్​, స్టూడెంట్స్​ యూనియన్లు చెప్తున్నాయి. అయితే మేనేజ్​మెంట్లు ముందే ఫీజు వసూలు చేస్తుండటంతో, స్టూడెంట్స్​ వెళ్లిపోయినా వాళ్లు కట్టిన ఫీజును రిటర్న్​ ఇవ్వడం లేదు.

గుర్తింపులేని కాలేజీలు.. భారీగా ఫీజులు

స్టేట్​లో ఈ అకడమిక్​ ఇయర్​లో 2,570 కాలేజీలకు ఇంటర్ బోర్డు అఫిలియేషన్​ ఇచ్చింది. సర్కారు, ఎయిడెడ్​ కాలేజీలు వెయ్యి వరకు ఉండగా.. మిగతావన్నీ కార్పొరేట్​, ప్రైవేటువి. 1,701 కార్పొరేట్, ప్రైవేటు కాలేజీలు అఫిలియేషన్​ కోసం రిజిస్టర్ చేసుకుంటే.. 1,486 కాలేజీలకే గుర్తింపు వచ్చింది. మరో 215 కాలేజీలకు గుర్తింపు దక్కలేదు. అయినా వాటిలో చాలా కాలేజీల్లో అడ్మిషన్లు నడిచాయ.నారాయణ, శ్రీచైతన్య సంస్థలకు చెందిన కాలేజీలతోపాటు 79 జూనియర్​ కాలేజీలు గుర్తింపు లేకుండా క్లాసులు నిర్వహిస్తున్నాయని అధికారులు చెప్తున్నారు. గుర్తింపు లేకున్నా దర్జాగా అడ్మిషన్లు నడిపించి.. పిల్లల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నాయి. ఒక్కో కార్పొరేట్​ కాలేజీలో రూ. 50వేల నుంచి రూ.3 లక్షలకు పైగా ఫీజులు వసూలు చేస్తున్నారు.

కాలేజీల్లో కౌన్సెలింగ్​ ఇచ్చేవారేరి?

గతేడాది రిజల్ట్స్ సమయంలో పదుల సంఖ్యలో స్టూడెంట్స్​ ఆత్మహత్యలు చేసుకోవడంతో, అన్ని కాలేజీల్లో కౌన్సెలర్లను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అయితే.. చాలా కార్పొరేట్ కాలేజీల్లో ఆ మాటలు పట్టించుకోలేదు. ఇంటర్‍ ఫస్ట్ ​ఇయర్‍లో అడ్మిషన్లు తీసుకున్న సమయంలోనే సిలబస్‍, పరిస్థితుల గురించి ఒరియంటేషన్​ క్లాసులూ నిర్వహించాలి. ఏ ఒక్క కార్పొరేట్ కాలేజీ ఆ పనిచేయడం లేదనే విమర్శలున్నాయి. కార్పొరేట్ కాలేజీల్లోని హాస్టళ్లలో ఉండే స్టూడెంట్స్​ పరిస్థితి మరీ దారుణం. మానసిక ఇబ్బందితో ఉన్నా,  జ్వరమొచ్చినా వాళ్ల గురించి మేనేజ్​మెంట్లు పట్టించుకోవనే ఆరోపణలు ఉన్నాయి. తమకు ఏమీ అర్థం కావడం లేదని స్టూడెంట్స్​ చెప్తే.. కొద్దిరోజులైతే అలవాటవుతుందని పేరెంట్స్​ బుజ్జగిస్తున్నారు. దీంతో సమస్యను ఎవరికీ చెప్పుకోవాలో తెలియక కుమిలిపోతున్నారని విద్యావేత్తలు  అంటున్నారు.

పేరెంట్స్ నుంచీ ఒత్తిళ్లే!

కొందరు పేరెంట్స్ తమ ఆశలను పిల్లల ద్వారా తీర్చుకోవాలని భావించడంతోనూ స్టూడెంట్స్​ మానసికంగా ఇబ్బందులు పడుతున్నారు. మ్యాథ్స్​ అంటే భయపడే స్టూడెంట్స్​ను కూడా ఇంటర్​లో ఎంపీసీలో చేర్పిస్తున్నారు. భవిష్యత్​లో ఇంజినీరింగ్ చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు. పిల్లల ఆసక్తికి అనుగుణంగా కోర్సుల్లో చేర్పించకపోవడంతోనూ వాళ్లపై ఒత్తిడి పెరుగుతోంది.

కలచివేస్తున్న మరణాలు

కార్పొరేట్​ కాలేజీల్లో చదువుల ప్రెషర్​ను తాళలేక వారం పదిరోజుల్లోనే ఆరుగురు స్టూడెంట్స్ చనిపోయారు. నాలుగు రోజుల క్రితం పటాన్‌‌చెరువు సమీపంలోని వెలిమేల గ్రామంలో ఉన్న నారాయణ రెసిడెన్షియల్ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న సంధ్యా రాణి ఆత్మహత్య చేసుకుంది. జ్వరం వచ్చినా ఇంటికి పంపకపోవడంతో ఆ బాలిక మానసిక వేదనకు గురైనట్టు తెలుస్తోంది. అయితే పేరెంట్స్ మాత్రం జ్వరంతో బాలిక చనిపోయిందని చెబితే.. మేనేజ్​మెంట్​ మాత్రం ఆత్మహత్య అని తెలిపింది. ఇక, హైదరాబాద్
నగర శివారులోని నార్సింగి శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్ సెకండియర్​ చదువుతున్న సంజయ్ ఆత్మహత్య చేసుకున్నాడు. కాలేజీ హాస్టల్​లోనే ఉరేసుకుని ప్రాణాలు విడిచాడు. వనపర్తి జిల్లా మదనాపురం మండల కేంద్రంలోని గురుకులంలో చదువుతున్న శ్రీకాంత్ అనే స్టూడెంట్​ కూడా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ర్యాగింగ్ కారణంగానే తన కుమారుడు చనిపోయాడని పేరెంట్స్ చెప్తున్నారు. కోకాపేటలో ఇంటర్ స్టూడెంట్​ కృష్ణ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ బాలుడి మృతిపై పేరెంట్స్ అనుమానాలు వ్యక్తం
చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు కాలేజీలో చదువుతున్న మాలోత్ మధు కూడా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కడుపునొప్పి భరించలేక చనిపోయాడని అక్కడి వారు చెప్తున్నారు. హైదరాబాద్‌‌లోని హయత్ నగర్ డీమార్ట్
వద్ద శ్రీచైతన్య కాలేజీకి చెందిన సతీశ్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. రాష్ట్రంలో వివిధ కారణాలతో 2018లో 125 మంది స్టూడెంట్స్ ఆత్మహత్య చేసుకున్నట్లు ఎన్సీఆర్​బీ తెలిపింది. 2017లో 168 మంది, 2016లో 81 మంది, 2015లో 97 మంది ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించింది. వీరిలో ఇంటర్​ స్టూడెంట్లే ఎక్కువ.

డిప్రెషన్‌లో ఉన్నారా.. ఫోన్ చేయండి..

చదువుతో ఒత్తిడికి లోనవుతున్న స్టూడెంట్లకు భరోసా కల్పించడానికి ఇంటర్ బోర్డు, సీబీఎస్ఈ బోర్డులతోపాటు, రోషిణిలాంటి స్వచ్ఛంద సంస్థలు హెల్ప్​​లైన్లు, కౌన్సిలింగ్ సెంటర్లను నిర్వహిస్తున్నాయి. ఇంటర్ బోర్డు 040–-24601010/24732369 హెల్ప్​లైన్ నంబర్లను ఏర్పాటు చేసింది. సీబీఎస్ఈ 1800118002 టోల్ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేసి కౌన్సెలర్లను నియమించింది. రోషిణి సంస్థ హైదరాబాద్‌లో చైల్డ్​ గైడెన్స్​ క్లినిక్‌ను ఏర్పాటు చేసింది. మానసిక ఆందోళన ఉంటే 040–-66661117 /66661118 నంబర్లకు ఫోన్ చేయొచ్చు లేదా క్లినిక్‌కు అయినా వెళ్లొచ్చు.

For More News..

యూత్‌కు ఉపాధి కోసం ‘కేసీఆర్ ఆపద్బంధు’

రూ. 50 ఇయ్యలేదని చిన్నారి ఆత్మహత్య

మహిళలకోసం మహిళా వైన్ షాపులు