
- వేధిస్తున్న టీచర్ల కొరత
- యూ డైస్ నంబర్ లేక అందని బియ్యం
- అమలుకాని మధ్యాహ్న భోజనం
- పట్టించుకోని ఆఫీసర్లు
సిద్దిపేట/గజ్వేల్, వెలుగు : సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని మల్లన్నసాగర్ ముంపు గ్రామాలను గజ్వేల్ సమీపంలో నిర్మించిన ఆర్ అండ్ ఆర్ కాలనీకి తరలించి నెలలు గడుస్తున్నా ఇంకా పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించలేదు. ముంపు గ్రామాల్లో మొత్తం 13 స్కూళ్లలో 1000 మంది విద్యార్థులు చదువుకునేవారు. ఈ గ్రామాలను పూర్తి స్థాయిలో గజ్వేల్ సమీపంలోని సంగాపూర్ కు తరలించడంతో వీరి కోసం రెండు అప్పర్ ప్రైమరీ, ఒక హైస్కూల్ ను ఏర్పాటు చేశారు. సింగారం డబుల్ బెడ్ రూమ్ కాలనీలో ఏడాది కింద అప్పర్ ప్రైమరీ స్కూల్ ఏర్పాటు చేయగా, కొన్ని నెలల కింద హైస్కూల్ తో పాటు మరో అప్పర్ ప్రైమరీ స్కూల్ ను ప్రారంభించారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఒత్తిళ్లతో స్కూళ్లను ప్రారంభించినా వారికి సరైన వసతి, ఇతర సౌకర్యాలు కల్పించకపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితితో ఇక్కడ చదువుతున్నవారు దాదాపు 500 మంది గజ్వేల్లోని ఇతర స్కూళ్లలో చేరిపోయారు. ఇదిలా ఉండగా తొగుట మండలంలోని ముంపు గ్రామాల్లో పాఠశాలలు పనిచేస్తున్నప్పుడు మొత్తం 58 మంది టీచర్లు ఉండగా, ఆర్ అండ్ ఆర్ కాలనీకి తరలించిన తరువాత 48 మంది డిప్యూటేషన్లపై ఇతర ప్రాంతాలకు వెళ్లారు. దీంతో ప్రస్తుతం నిర్వహిస్తున్న స్కూళ్ల లో టీచర్ల కొరత ఏర్పడింది.
16 మంది టీచర్లకు నలుగురే..
ఆర్ అండ్ ఆర్ కాలనీలో ఏర్పాటు చేసిన హైస్కూల్లో మొత్తం 330 మంది విద్యార్థులు ఉన్నారు. వారికి 16 మంది టీచర్లు అవసరం కాగా, ప్రస్తుతం నలుగురు టీచర్లు మాత్రమే ఉన్నారు. వీరిలో ఒకరు పీఈటీ కావడంతో సబ్జెక్ట్ టీచర్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఇతర పాఠశాలల్లో ఇప్పటికే దాదాపు 50 శాతం టెన్త్ సిలబస్ పూర్తి కాగా, ఇక్కడ టీచర్లు లేక 25 శాతం కూడా కంప్లీట్కాలేదు.
యూ డైస్ నంబర్ కేటాయింపులో జాప్యం
ఆర్ అండ్ ఆర్ కాలనీలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ పాఠశాలలకు ఇప్పటికీ యూ డైస్ నంబర్ ను కేటాయించకపోవడంతో ముంపు గ్రామాల పేర్ల తోనే పాఠశాలలను నడుపుతున్నారు. దీంతో సివిల్ సప్లయ్ అధికారులు ఈ స్కూళ్లలో మధ్యాహ్న భోజనానికి బియ్యాన్ని సరఫరా చేయడం లేదు. మధ్యాహ్నం భోజనం లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. దీనికి తోడు తాగునీరు, టాయిలెట్స్, తదితర సౌలతులు లేవు. ఇప్పటికైనా సంబంధిత ఆఫీసర్లు స్పందించి కాలనీలోని స్కూళ్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు.
సౌకర్యాలు కల్పించాలి
కాలనీలోని స్కూళ్లలో కనీస సౌకర్యాలు కల్పించాలి. తాగునీరు, టాయిలెట్స్ లేక ఇబ్బంది పడుతున్నాం. మధ్యాహ్న భోజనం లేక ఇంటికి వెళ్లి తినిరావాల్సి వస్తోంది. చదువులకు ఆటంకం కలుగకుండా ఆఫీసర్లు వెంటనే చర్యలు తీసుకోవాలి.
- నవ్య శ్రీ, 10వ తరగతి
టీచర్లను నియమించాలి
ఆర్ అండ్ ఆర్ కాలనీలోని హైస్కూల్లో విద్యార్థులకు సరిపోయే విధంగా టీచర్లను నియమించాలి. విద్యా సంవత్సరం ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా ఆ స్థాయిలో సిలబస్ పూర్తి కాడం లేదు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలి.
- స్పందన, 10 తరగతి
సమస్యల పరిష్కారానికి చర్యలు
ఆర్ అండ్ ఆర్ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలల్లోని సమస్యలను పది రోజుల్లో పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాం. టీచర్ల కొరతను తీర్చడానికి వర్క్ అడ్జెస్ట్ మెంట్ కింద ఇతర టీచర్లను పంపడం జరుగుతోంది. యూ డైస్ కోడ్ లేకపోవడంతో విద్యార్థుల వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేయలేదు. దీంతో మధ్యాహ్న భోజనానికి బియ్యం విడుదలలో సాంకేతిక సమస్య ఏర్పడింది. యూ డైస్ కోడ్ ను కేటాయించగానే మధ్యాహ్న భోజనాన్ని ప్రారంభిస్తాం. అన్ని సమస్యలు పది రోజుల్లో పరిష్కరిస్తాం.
- యాదవరెడ్డి, ఎంఈవో, తొగుట