ఇఫ్లూలో పీజీ విద్యార్థినిపై లైంగిక వేధింపులు!

ఇఫ్లూలో పీజీ విద్యార్థినిపై  లైంగిక వేధింపులు!
  • నిందితులను గుర్తించాలని స్టూడెంట్ల ఆందోళన
  • రాత్రిదాకా అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వద్ద బైఠాయింపు
  • వర్సిటీ వీసీ, రెక్టార్​ రాజీనామా చేయాలని డిమాండ్
  • బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన ఓయూ పోలీసులు
  • బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకుంటామన్న  వర్సిటీ అధికారులు

ఓయూ,వెలుగు : ఇఫ్లూలో  పీజీ విద్యార్థినిపై  లైంగిక వేధింపుల ఘటన వర్సిటీలో ఉద్రిక్తతకు దారితీసింది. నిందితులను గుర్తించి అరెస్ట్ చేయాలని విద్యార్థులు వర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఎదుట ఆందోళనకు దిగారు. క్యాంపస్​లో విద్యార్థులకు రక్షణ కల్పించడంలో వైస్​చాన్స్​లర్, రెక్టార్ ఫెయిల్​ అయ్యారని, వారు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్​చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఇఫ్లూ(ఇంగ్లీష్​ అండ్​ ఫారిన్​లాంగ్వేజెస్​యూనివర్సిటీ)లో బుధవారం రాత్రి 10 గంటలకు వర్సిటీ ఆవరణలో  ఓ పీజీ విద్యార్థిని వాకింగ్ చేస్తూ.. చీకటి ప్రాంతంలోకి వెళ్లింది. అక్కడ గుర్తు తెలియని వ్యక్తులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆమె తన సహచరులకు తెలిపింది. వెంటనే ఓయూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

గురువారం ఉదయం  విద్యార్థులు అడ్మినిస్ట్రేషన్ భవనం ఎదుట ఆందోళనకు దిగి  నిందితులను గుర్తించి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. రాత్రి వరకు ఆందోళన చేస్తుండగా వర్సిటీ అధికారు లెవరూ పట్టించుకోకపోవడంతో ఆగ్రహించిన విద్యార్థులు ‘ వీసీ మిస్సింగ్’ అంటూ క్యాంపస్​లో ఆయన ఫొటోతో కూడిన పోస్టర్లు వేశారు. వర్సిటీ అధికారులు స్పందించడం లేదని, నిందితులను గుర్తించి చర్యలు తీసుకునే వరకు ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థులు స్పష్టంచేశారు. ఓయూ పోలీసులు వెళ్లి విద్యార్థులను ఆందోళన విరమించాలని కోరారు. 

కేసు నమోదు చేసిన ఓయూ పోలీసులు 

వర్సిటీ ఆవరణలో వాకింగ్​ చేస్తూ.. లైటింగ్​సరిగా లేని ప్రాంతానికి వెళ్లగానే కొందరు వ్యక్తులు తనను లైంగికంగా వేధించారని బాధిత విద్యార్థిని ఫిర్యాదు చేసినట్లు ఓయూ సీఐ ఆంజనేయులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని బాధిత విద్యార్థిని మెడికల్ టెస్టు
లకు గాంధీ ఆస్పత్రికి , అటునుంచి భరోసాసెంటర్​కు పంపించినట్టు చెప్పారు. కేసు దర్యాప్తులో భాగంగా ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తుండగా, ఆ ప్రాంతంలో చీకటిగా ఉండడంతో ఎవరూ స్పష్టంగా కనిపించడం లేదని పేర్కొన్నారు. 

 నిందితులను గుర్తిస్తాం..

విద్యార్థినిపై లైంగిక వేధింపుల ఘటనపై వర్సిటీ అధికారులు స్పందించారు. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు సమాచారం అందడంతో వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. నిందితులను గుర్తించి  చర్యలు తీసుకుంటామని చెప్పారు. వర్సిటీలోని ఫిర్యాదుల కమిటీ తక్షణమే విచారణ చేపట్టినట్లు పేర్కొన్నారు. క్యాంపస్ లో ఇలాంటి ఘటన జరగడం బాధాకరమని అధికారులు తెలిపారు.