పాత పద్ధతిలోనే  పీహెచ్డీ అడ్మిషన్లు కల్పించాలె

పాత పద్ధతిలోనే  పీహెచ్డీ అడ్మిషన్లు కల్పించాలె

హైదరాబాద్: పాత పద్ధతిలోనే పీహెచ్డీ ప్రవేశాలు కల్పించాలని శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థులపై వీసీ పోలీసులతో దాడులు చేయడాన్ని నిరసిస్టూ విద్యార్థి సంఘాలు  రేపు ఓయూ బంద్ కు పిలుపునిచ్చాయి. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ... పాత పద్ధతిలోనే పీహెచ్డీ ప్రవేశాలు కల్పించాలని, క్యాంపస్ లో మౌళిక సదుపాయాలు కల్పించాలని ఈ నెల 23న తాము ఓయూ ఆర్ట్స్ కాలేజీ ముందు శాంతియుతంగా నిరసన చేపట్టామని, అయితే వీసీ పోలీసులతో తమపై దాడులు చేయించారని తెలిపారు. ఈ దాడిలో చాలా మంది విద్యార్థులు గాయపడినట్లు వారు చెప్పారు. కొన్నేళ్లుగా ఓయూలో పీహెచ్డీ అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ ఇవ్వడంలేదన్న వాళ్లు... దీంతో యూజీసీ ఫెల్లోషిప్ ఉండి కూడా చాలా మంది విద్యార్థులు నష్టపోతున్నారని వాపోయారు. పాత పద్ధతిలో కాకుండా... మెరిట్ ప్రాతిపదికన పీహెచ్డీ ప్రవేశాలు కల్పిస్తామని పాలకర్గం చెబుతోందని, దీనివల్ల యూజీసీ ఫెల్లోషిప్ ఉన్న చాలామంది విద్యార్థులకు నష్టం కలిగే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

అలాగే క్యాంపస్ లోని చాలా హాస్టళ్లలో మౌళిక వసతులు లేవని, వాటి కల్పనకు అధికారులు ఏమాత్రం కృషిచేయడం లేదని ఆరోపించారు. ఇదే విషయమై వీసీని కలవడానికి వెళ్తే... ప్రైవేట్ సైన్యంతో తమపై దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. అదేవిధంగా గ్రామాల నుంచి ఎంతో కష్టపడి క్యాంపస్ దాకా వచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులను కించపరిచే విధంగా వీసీ మాట్లాడుతున్నారని వారంతా ఆరోపించారు. ఇప్పటికైనా యూజీసీ నిబంధనల ప్రకారం పీహెచ్డీ నోటిఫికేషన్ రిలీజ్ చేసి... పాత పద్ధతిలోనే అడ్మిషన్ కల్పించాలని, క్యాంపస్ లో మౌళిక వసతుల కల్పనకు కృషి చేయాలని విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు. ఓయూలోని అధ్యాపకులు, ఉద్యోగులు, విద్యార్థులు రేపటి బంద్ కి సహకరించాలని కోరారు.