రాష్ట్రంలో ఒమిక్రాన్ వ్యాప్తిపై జనాల్లో చర్చ

రాష్ట్రంలో ఒమిక్రాన్ వ్యాప్తిపై జనాల్లో చర్చ
  • వందల మందిని కలిసిన ఒమిక్రాన్ పేషెంట్లు 
  • ప్రైమరీ కాంటాక్టులకూ అంటని వైరస్‌‌
  • ఇప్పటికి రెండే లోకల్ కేసులు

హైదరాబాద్, వెలుగు:  డెల్టా కంటే ఒమిక్రాన్ వేరియంట్‌‌ నాలుగైదు రెట్లు స్పీడ్‌‌గా స్ప్రెడ్‌ అవుతోందని డబ్ల్యూహెచ్‌‌వో దగ్గర్నుంచి రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ వరకూ అందరూ చెప్తున్నప్పటికీ, మన రాష్ట్రంలో మాత్రం అలాంటి సూచనలే కనిపించట్లేదు. కెన్యాలో, సోమాలియాలో ఒమిక్రాన్ బారినపడి ఇక్కడికి వచ్చినోళ్లు వందల మందిని కాంటాక్ట్ అయినప్పటికీ అందులో ఒక్కరికే కొత్త వేరియంట్ అంటుకుంది. యూకే నుంచి హన్మకొండకు వచ్చిన మహిళకు ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చింది. ఆమెతో కలిసి ఇంట్లోనే ఉన్న ఆమె భర్తకు, బిడ్డకు వైరస్ అంటలేదు. ఆమెను కలిసిన 30 మంది ప్రైమరీ కాంటాక్టులలో కనీసం ఒక్కరికీ వైరస్ సోకలేదు. జూబ్లీహిల్స్‌‌లో ఒమిక్రాన్ పేషెంట్‌‌కు 3రోజుల పాటు ఫుడ్ సర్వ్ చేసిన హోటల్ సిబ్బందిలోనూ ఎవరికీ ఈ వేరియంట్ అంటలేదు. ఇలా చెప్తూపోతే చాలా ఎగ్జాంపుల్సే ఉన్నయి. సౌత్ ఆఫ్రికా, యూకే, అమెరికా తదితర దేశాల్లో పరిస్థితి చూస్తే డబ్ల్యూహెచ్‌‌వో చెబుతున్నట్టు ఒమిక్రాన్‌‌కు స్పీడ్ ఎక్కువేనన్న విషయం స్పష్టం అవుతోంది. కానీ, మన దగ్గరకు వచ్చేసరికి ఒమిక్రాన్ స్పీడ్ తగ్గిపోయిన సూచనలు కన్పిస్తున్నయి. హెల్త్ డిపార్ట్‌‌మెంట్ చెబుతున్న లెక్క ప్రకారం ఆదివారం నాటికి రాష్ట్రంలో 44 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 40 మంది విదేశాల నుంచి వచ్చినవాళ్లు అని, ఇంకో ఇద్దరికి లోకల్‌‌గా స్ర్పెడ్ అయిందని ప్రకటించారు. ఈ ఇద్దరికీ తప్ప లోకల్​గా ఇంకెవరికీ స్ప్రెడ్​ కాలేదని చెప్తోంది.

టీకాలు, ఇమ్యూనిటీ వల్లే కావొచ్చు: హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు

‘‘ఒమిక్రాన్‌‌ పేషెంట్ల ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులలో 1200 మందికి టెస్ట్ చేశాం. అందులో ఇద్దరికే సోకింది. మిగతావాళ్లంతా విదేశాల నుంచి వచ్చినోళ్లే. వ్యాక్సినేషన్, డెల్టా వేరియంట్ సోకడం వల్ల వచ్చిన ఇమ్యూనిటీ కారణంగా ఒమిక్రాన్‌‌ సోకట్లేదని అనుకుంటున్నాం. అందరూ మాస్క్ వాడుతుండడం కూడా ఓ కారణం కావచ్చు. థర్డ్ వేవ్‌‌ వస్తుందని మా అంచనా. డెల్టా తరహాలో సీరియస్‌‌గా మాత్రం ఉండదు. నార్మల్ సింప్టమ్స్‌‌తో వచ్చి పోతుంది” అని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు  ‘వెలుగు’తో అన్నారు.  

చాపకింద నీరులా వ్యాప్తి: డాక్టర్ బుర్రి రంగారెడ్డి

‘‘వ్యాక్సిన్ వేసుకుంటేనో, ఇదివరకే వైరస్ బారిన పడడం వల్లనో ఒమిక్రాన్ సోకట్లేదనుకోవడం కరెక్ట్‌‌ కాదు. వందల మంది కాంటాక్ట్స్‌‌లో ఒకరిద్దరికే సోకిందంటే నమ్మేలా లేదు. ఇప్పటికే చాలా మందికి వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తుండొచ్చు. టెస్టులు, సీక్వెన్సింగ్ ఎక్కువగా చేసినప్పుడు అసలు విషయం బయటపడుతుంది. ” అని రంగారెడ్డి ‘వెలుగు’కు వివరించారు.

ఇప్పుడే కన్‌‌క్లూజన్‌‌కు రాలేం: సీసీఎంబీ డైరెక్టర్ వినయ్ 

‘‘ఇండియాలో ఒమిక్రాన్ వ్యాప్తిపై ఇప్పుడే ఒక నిర్ణయానికి రావడం తొందరపాటే అవుతుంది. మరో 10 రోజుల్లో వైరస్ ఎఫెక్ట్ పై క్లారిటీ రావొచ్చు. ఇది డెల్టా కంటే ఎక్కువ స్పీడ్ అనే విషయం స్పష్టమైంది’’ అని సీసీఎంబీ డైరెక్టర్ వినయ్ తెలిపారు. మాస్కులు, సోషల్ డిస్టెన్స్ పాటిస్తూనే, పరిస్థితిని ఎదుర్కొవాలని సూచించారు. 

పెద్దగా భయంలేదు: డాక్టర్‌‌‌‌ శ్రీకృష్ణారావు, హనుమకొండ

‘‘బ్రిటన్ నుంచి వచ్చిన హనుమకొండ మహిళకు ఒమిక్రాన్ కన్ఫామ్ అయింది. ట్రీట్​మెంట్ జరగుతోంది. ఆమెతోపాటు కుటుంబ సభ్యులకు ఎలాంటి సింప్టమ్స్ లేవు. ఆమె ప్రైమరీ కాంటాక్టులు 30 మందికి టెస్టులు చేయగా.. నెగెటివ్​ వచ్చింది. దీన్ని బట్టి చూస్తే ఒమిక్రాన్​తో పెద్దగా భయం లేదనిపిస్తోంది’’ అని హన్మకొండ జిల్లా సర్వీలెన్స్ ఆఫీసర్ డాక్టర్‌‌‌‌ శ్రీకృష్ణారావు చెప్పారు.