టన్నెల్‎లో ఫ్లైట్ నడిపిన స్టంట్ పైలట్

టన్నెల్‎లో ఫ్లైట్ నడిపిన స్టంట్ పైలట్

టర్కీ: మాములుగానే ఫ్లైట్ నడపడమంటే కత్తి మీద సాములా ఉంటుంది. అటువంటిది ఓ టన్నెల్‎లో ఫ్లైట్ నడిపితే.. ఫ్లైట్ అటూ ఇటూ ఏమాత్రం తేడా జరిగినా.. ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. కానీ ఇటలీకి చెందిన ఓ ఎయిర్ రేసర్ మాత్రం ఒక టన్నెల్ నుంచి మరో టన్నెల్‎‎కు ఫ్లైట్ నడిపి రికార్డ్ సృష్టించాడు. ఇటాలియన్ ఎయిర్ రేసర్, స్టంట్ పైలట్ డారియో కోస్టా ఈ అద్భుతాన్ని నిజం చేశాడు. టర్కీలోని ఇస్తాంబుల్‌లోని రెండు టన్నెల్‌ల ద్వారా విమానం నడిపి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాడు. కోస్టా ఒక టన్నెల్‎లో 1,730 మీటర్లు ప్రయాణించి.. మరో టన్నెల్‎లోకి ప్రవేశించాడు. రెండో టన్నెల్ ద్వారా బయటకు వచ్చి టేకాఫ్ తీసుకున్నాడు. మొత్తంగా రెండు టన్నెల్స్ కలిపి గంటకు 245 కి.మీ. వేగంతో 2.6 కి.మీ. ప్రయాణం చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్‎లో చోటు దక్కించుకున్నాడు. ఈ ఫ్లైట్ జర్నీ యొక్క వీడియోను ఆస్ట్రియన్ కంపెనీ రెడ్ బుల్.. సెప్టెంబర్ 4, 2021న ఫేస్‌బుక్‌లో విడుదల చేసింది. ఈ వీడియోకు ఇప్పటికే 1.5 లక్షల లైకులు రాగా.. 65 వేల షేర్ లభించాయి. 

ఈ స్టంట్‎తో కొత్త రికార్డులు నమోదయ్యాయి. టన్నెల్ గుండా ప్రయాణించిన తొలి విమానం, ఒక టన్నెల్ నుంచి మరో టన్నెల్ లోకి ప్రయాణించిన విమానం, టన్నెల్ నుంచి టేకాఫ్ తీసుకున్న తొలి విమానం వంటి రికార్డులను కోస్టా నెలకొల్పాడు.