
బోధన్, వెలుగు : ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు లోనుకావద్దని సబ్ కలెక్టర్ వికాస్ మహతో సూచించారు. శుక్రవారం బోధన్ మండలం పెంటకుర్దులో ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక కోసం సర్వే కొనసాగుతుండడంతో సబ్ కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ లబ్ధిదారుల ఎంపికలో రాజకీయ నాయకులు జోక్యం చేసుకోవద్దని సూచించారు. అధికారులు పకడ్బందీగా సర్వే చేయాలన్నారు. అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇండ్లు దక్కాలన్నారు. సర్వేలో లోటుపాట్లు జరిగితే సర్వే సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట ఎంపీవో మధుకర్, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.
రిజిస్ట్రేషన్ కోసం వచ్చే కస్టమర్లకు అన్నదానం
బోధన్, వెలుగు : బోధన్ పట్టణంలోని తహసీల్దార్ ఆఫీస్ వద్ద సబ్ కలెక్టర్ వికాస్ మహతో శుక్రవారం అన్నదాన కార్యక్రమం ప్రారంభించి మాట్లాడారు. భూముల రిజిస్ట్రేషన్ కోసం దూరప్రాంతాల నుంచి వచ్చిన వారి కోసం ఇస్కాన్ టెంపుల్ వారి సహకారంతో అన్నదాన కార్యక్రమం ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ విఠల్, ఆర్ఐ వరుణ్, ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.