బోథ్, వెలుగు: బోథ్ పోలీస్స్టేషన్ నుంచి పరారైన నిందితుడిని అరెస్టు చేసినట్లు ఎస్సై శ్రీసాయి తెలిపారు. సొనాల మండలం చింతల్బోరి గ్రామానికి చెందిన కాంట్రాక్టర్కాంబ్లె సత్యనారాయణ ఇటీవల కోటా(కె) గ్రామానికి చెందిన ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారురాలి భర్త మారుతిని డబ్బుల విషయంలో చెట్టుకు కట్టేసి కొట్టాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, సత్యనారాయణను అరెస్ట్చేశారు. కాగా, బుధవారం రాత్రి అతను మూత్ర విసర్జనకు వెళ్లొస్తానని చెప్పి, ఠాణా నుంచి పరారయ్యాడు. గాలింపు చేపట్టిన పోలీసులు సత్యనారాయణ మహారాష్ట్రలో ఉన్నట్లు తెలుసుకున్నారు. శనివారం ఘన్పూర్చెక్పోస్ట్ వద్ద అతన్ని అరెస్ట్చేశారు.
టేకు చెట్లను నరికిన వ్యక్తి..
ఖానాపూర్, వెలుగు: ఖానాపూర్ ఫారెస్ట్ డివిజన్ పరిధి ఉడుంపూర్ రేంజ్ లోని రాంపూర్ బీట్ లో అక్రమంగా 15 టేకు చెట్లను నరికిన ఎంబడి రాజశేఖర్ ను అరెస్ట్ చేసినట్లు ఫారెస్ట్ డివిజన్ ఆఫీసర్ శివ కుమార్ తెలిపారు. శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. జన్నారం, కల్లెడ గ్రామాలకు చెందిన రాజశేఖర్, సాయి కిరణ్, కల్యాణ్ టేకు చెట్లను నరికారన్నారు. రాజశేఖర్ ను అరెస్ట్చేశామని, మిగతా ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. రేంజర్ కిరణ్ కుమార్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
వడ్ల గోల్ మాల్ కేసులో నిందితుడు..
జైపూర్, వెలుగు: జైపూర్ మండలంలో జరిగిన వడ్ల గోల్ మాల్ కేసుకు సంబంధించి ఒక నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై శ్రీధర్ తెలిపారు. నర్సింగాపూర్, -మద్దులపల్లి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ లో 13 మంది వడ్ల లెక్కలు తప్పుగా చూపించి, సివిల్ సప్లై ఫండ్స్ రూ.1.39 కోట్లు కాజేశారన్నారు. ఈ కేసులో మూడో నిందితుడు తాటిపల్లి సాయి కుమార్ ను శనివారం అతని ఇంటి వద్దే అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. మిగతా12 మంది పరారీలో ఉన్నారని, వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
గంజాయి విక్రేత..
కాగజ్ నగర్, వెలుగు: గంజాయి విక్రయిస్తున్న చింతల మానేపల్లి మండలం టేకంగూడకు చెందిన దుర్గం చిరంజీవిని శనివారం అరెస్ట్చేసినట్లు కౌటాల సీఐ సంతోష్కుమార్తెలిపారు. అతని వద్ద నుంచి 200 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఇతని తల్లి శాంతాబాయి ఇటీవల గంజాయిని చేనులో దాచేందుకు వెళ్తూ పట్టుబడిందని చెప్పారు. చిరంజీవి సలువుగా డబ్బు సంపాదించాలని భావించి, మహారాష్ట్ర నుంచి తక్కువ ధరకు కొనుక్కొచ్చి, ఇక్కడ కూలీలు, విద్యార్థులు, యువకులకు ఎక్కువ ధరకు అమ్ముతున్నాడని తెలిపారు. నిందితుడిని సిర్పూర్ (టి) జడ్జి ఎదుట ప్రవేశపెట్టగా రిమాండ్ విధించినట్లు పేర్కొన్నారు. ఎస్సై నరేశ్, సిబ్బంది ఉన్నారు.
