ఏసీబీ వలలో గంగాధర ఇన్​చార్జి సబ్​రిజిస్ట్రార్

ఏసీబీ వలలో గంగాధర ఇన్​చార్జి సబ్​రిజిస్ట్రార్
  • గిఫ్ట్​డీడ్​ రిజిస్ట్రేషన్​కు రూ.10 వేలు డిమాండ్​

గంగాధర, వెలుగు :  కరీంనగర్​ జిల్లా కొత్తపల్లి మండలం రేకుర్తికి చెందిన ఒకరి భూమిని గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ చేసేందుకు గంగాధర ఇన్ చార్జి సబ్​రిజిస్ట్రార్​లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి కథనం ప్రకారం..రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని వెంకంపేటకు చెందిన  కొక్కుల రాజేశానికి కరీంనగర్​ జిల్లా కొత్తపల్లి మండలం రేకుర్తి సర్వే నంబర్ 131లో 486.42 చదరపు గజాల భూమి ఉంది. రాజేశం ఈ భూమిని తన కొడుకు అజయ్​కుమార్​కు గిఫ్ట్ డీడ్ చేయించాలనుకున్నాడు.

గంగాధరకు చెందిన తన ఫ్రెండ్, డాక్యుమెంట్​ రైటర్​ ఆకుల అంజయ్యతో కలిసి రెండు రోజుల కింద గంగాధర సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు వచ్చి ఇన్​చార్జి సబ్ రిజిస్ట్రార్ శివారం సురేశ్​బాబును కలిశారు. రూ.10 వేలు లంచం ఇస్తేనే పనవుతుందని సురేశ్​బాబు స్పష్టం చేశాడు. దీంతో అంజయ్య ఏసీబీని ఆశ్రయించాడు. ఔట్​సోర్సింగ్ ఎంప్లాయ్, ఆఫీస్​ సబార్డినేట్​ కొత్తకొండ శ్రీధర్​కు డబ్బులు ఇవ్వాలని సబ్ రిజిస్ట్రార్ సూచించడంతో శనివారం రూ.10 వేలు ఇస్తుండగా ఏసీబీ పట్టుకుంది. సురేశ్​బాబు, శ్రీధర్​పై కేసు నమోదు చేశామని, ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. కరీంనగర్​లోని మంకమ్మ తోటలో ఉన్న సురేశ్​బాబు ఇంట్లో సోదాలు నిర్వహించి రూ.12.3 లక్షల నగదు , 350 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నామన్నారు.