విద్యార్థులను రెచ్చగొట్టింది సుబ్బారావేనని గుర్తింపు

విద్యార్థులను రెచ్చగొట్టింది సుబ్బారావేనని గుర్తింపు

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్  విధ్వంసం కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావు పోలీసుల విచారణలో కొత్త విషయాలు చెప్పినట్లు తెలుస్తోంది. శివ, మల్లారెడ్డి, రెడ్డప్ప, హరి అనే అనుచరులతో కలిసి విధ్వంసానికి అతడు ప్లాన్ చేశాడని దర్యాప్తులో పోలీసులు తేల్చినట్లు సమాచారం. విద్యార్థులను సుబ్బారావే రెచ్చగొట్టాడని గుర్తించారు. అతడి ఆదేశాల మేరకే వాట్సాప్ గ్రూపుల్లో ఆందోళనలు చేయాలని అనుచరులు పిలుపునిచ్చారని వెల్లడైంది.

గుంటూరులో ర్యాలీ నిర్వహించినప్పటి నుంచే..

గుంటూరులో ర్యాలీ నిర్వహించినప్పటి నుంచే ఆందోళనకు స్కెచ్‌ సిద్ధం చేసే పనిలో సుబ్బారావు నిమగ్నమైనట్లు తేలింది.  జూన్‌ 16న సికింద్రాబాద్‌ కు  చేరుకున్న సుబ్బారావు.. ఓ హోటల్‌లో అనుచరులతో భేటీ అయి విధ్వంసానికి ప్రణాళిక చేశాడని పోలీసు వర్గాలు తెలిపాయి. నరేష్‌ అనే మరో అనుచరుడితో ఆందోళనకారులకు ఆహార పదార్థాలను కూడా పంపించాడని పేర్కొన్నాయి. ప్రస్తుతం నరేష్ పరారీలో ఉన్నాడని  చెప్పాయి. సుబ్బారావు తో పాటు మరో ఆరుగురు తమ అదుపులో ఉన్నారని  పోలీసులు స్పష్టం చేశారు. కాగా,  అగ్నిపథ్​ స్కీమ్​ ను నిరసిస్తూ ఈనెల 17న ఉదయం 8.56  గంటల సమయంలో సికింద్రాబాద్​ రైల్వేస్టేషన్ లోకి 1500 మంది చొరబడ్డారు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా నిరసనకారులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది.