టైటానిక్ శిథిలాలు చూసేందుకు వెళ్లి..సబ్​మెర్సిబుల్ గాయబ్

టైటానిక్ శిథిలాలు చూసేందుకు వెళ్లి..సబ్​మెర్సిబుల్ గాయబ్
  •     అట్లాంటిక్  సముద్రంలో మిస్సయిన సబ్ మెర్సిబుల్​
  •     అందులోని ఐదుగురి ఆచూకీ తెలియట్లేదన్న టూరిజం కంపెనీ
  •     సముద్ర గర్భంలో భారీ ఎత్తున వెతుకులాట ప్రారంభం

వాషింగ్టన్: అట్లాంటిక్ మహా సముద్రంలో ఓ సబ్ మెర్సిబుల్ క్రాఫ్ట్ (చిన్నపాటి జలాంతర్గామి) ఒకటి గల్లంతయ్యింది. టైటానిక్ శిథిలాలను చూపించేందుకు పర్యాటకులను తీసుకెళ్లే క్రమంలో కమ్యూనికేషన్ తెగిపోయిందని టూర్ నిర్వాహకులు ప్రకటించారు. దీంతో ప్రభుత్వంతో పాటు ఈ టూర్ లు చేపట్టిన ఓషియన్ గేట్ కంపెనీ కూడా సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టింది. మిస్సయిన సబ్​ మెర్సిబుల్​ క్రాఫ్ట్​ లో నాలుగు రోజులకు సరిపడా ఆక్సిజన్ ఉందని తెలిపింది. అందులోని టూరిస్టులతో పాటు తమ సిబ్బంది ఆచూకీ కనుగొనేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు వివరించింది.  వారిని క్షేమంగా తిరిగి తీసకొచ్చేందుకు అన్ని మార్గాలలో ప్రయత్నిస్తున్నట్లు కంపెనీ ఉన్నతాధికారులు తెలిపారు. ఇందులో ప్రభుత్వ సంస్థలు కూడా సాయం అందిస్తున్నాయని వివరించారు. అయితే, ఈ సబ్ మెర్సిబుల్ క్రాఫ్ట్ తో కమ్యూనికేషన్ ఎప్పుడు తెగిపోయింది తదితర వివరాలను కంపెనీ వెల్లడించలేదు.

ఇద్దరు సిబ్బంది.. ముగ్గురు గెస్టులు

అట్లాంటిక్ మహాసముద్రంలో టైటానిక్ షిప్ మునిగిపోయిన విషయం తెలిసిందే. దాదాపు శతాబ్దం కిందట చోటుచేసుకుందీ దుర్ఘటన.. షిప్ మునిగిన చోట గాలించి శిథిలాలను కూడా గుర్తించారు. ఇటీవల ఈ శిథిలాలను చూపిస్తామంటూ ఓషియన్ గేట్​ టూరిజం కంపెనీ ప్రకటించింది. సముద్రగర్భంలోకి తీసుకెళ్లి టైటానిక్ ఓడ శిథిలాలను దగ్గరి నుంచి చూపిస్తోంది కూడా.. చిన్నపాటి సబ్ మెరైన్ ను ఉపయోగించి టూరిస్టులను తీసుకువెళ్లి, తిరిగి తీసుకొస్తోంది. ఇందుకోసం ఒక్కొక్కరి నుంచి 2.5 లక్షల డాలర్లను వసూలు చేస్తోంది. సబ్ మెర్సిబుల్​ లో సాధారణంగా ఓ పైలట్, ముగ్గురు టూరిస్టులు, ఓ నిపుణుడు ఉంటారు.