నిరుటితో పోలిస్తే 28% తగ్గనున్న సబ్సిడీ బిల్లులు

నిరుటితో పోలిస్తే 28% తగ్గనున్న సబ్సిడీ బిల్లులు

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై సబ్సిడీల భారం గణనీయంగా తగ్గింది. ఆహార ధాన్యాలు, ఎరువులు, పెట్రోలియం(ఎల్పీజీ)పై సబ్సిడీ బిల్లుల అంచనాలు పోయిన బడ్జెట్ తో పోలిస్తే ఈ సారి బడ్జెట్ లో 28 శాతం తగ్గాయి. ఫర్టిలైజర్స్ పై 31%, పెట్రోలియంపై 75% సబ్సిడీ బిల్లులు తగ్గాయి. మొత్తంగా మూడింటికి కలిపి 2023–24లో రూ. 4.03 లక్షల కోట్ల బిల్లులు అవుతాయని ఆర్థిక మంత్రి అంచనా వేశారు. 2022–23 బడ్జెట్ లో సబ్సిడీ బిల్లులను రూ. 3.56 లక్షల కోట్లుగా అంచనా వేయగా, ఆ తర్వాత 58% పెంచి, రూ. 5.62 లక్షల కోట్లకు సవరించారు. 

ఎరువుల రాయితీలు ఇలా.. 

పోయిన ఏడాది బడ్జెట్ లో ఎరువులపై సబ్సిడీని తొలుత రూ. 1.05 లక్షల కోట్లుగా అంచనా వేశారు. ఆ తర్వాత రూ. 2.25 లక్షల కోట్లుగా అంచనాలను సవరించారు. ఫర్టిలైజర్స్ పై సబ్సిడీని ఈ ఏడాది 31% తగ్గించి రూ. 1.75 లక్షల కోట్లకు కుదించారు. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతాయన్న అంచనాలు, ఫర్టిలైజర్ కంపెనీలకు గ్యాస్ ప్రొక్యూర్ మెంట్ పాలసీని సవరించినందున ఈ సబ్సిడీని కేంద్రం తగ్గించాలని నిర్ణయించింది. 

పెట్రోలియం సబ్సిడీలు ఇలా.. 

పోయిన బడ్జెట్ లో ఎల్పీజీ సహా పెట్రోలియం సబ్సిడీలు రూ. 9,170 కోట్లుగా అంచనా వేశారు. ఈసారి ఈ సబ్సిడీలను 75% తగ్గించి రూ. 2,257 కోట్లుగా అంచనా వేశారు. 

ఈ ఏడాది సబ్సిడీ అంచనాలు ఇలా..   

ఫుడ్ సబ్సిడీలు: రూ. 1.97 లక్షల కోట్లు 
(31% తగ్గుదల)  
ఫర్టిలైజర్ సబ్సిడీలు: రూ. 1.75 లక్షల కోట్లు (22% తగ్గుదల) 

పెట్రోలియం (ఎల్పీజీ) సబ్సిడీలు: 

రూ. 2,257 కోట్లు (75% తగ్గుదల) 

ఫుడ్ సబ్సిడీలు ఇలా.. 

పోయిన బడ్జెట్ లో ఆహారధాన్యాలపై సబ్సిడీ బిల్లులను రూ. 2.87 లక్షల కోట్లుగా అంచనా వేయగా, ఈసారి 22% తగ్గించి రూ.1.97 లక్షల కోట్లుగా అంచనా వేశారు. అయితే, పోయిన ఏడాదిలో కరోనా విపత్తు కారణంగా ఫ్రీ రేషన్ అందజేయడంతో ఆహారధాన్యాలపై సబ్సిడీ భారీగా పెరిగింది. ఇప్పుడు ఫ్రీ రేషన్ స్కీంను మరో ఏడాది పొడిగించినప్పటికీ, క్వాంటిటీని తగ్గించడంతో సబ్సిడీ భారం బాగా తగ్గనుంది.