
నెట్వర్క్, వెలుగు : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశ వ్యాప్తంగా బుధవారం చేపట్టిన సార్వత్రిక సమ్మె ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సక్సెస్ అయ్యింది. కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు ప్రాంతాల్లోని సింగరేణి మైన్స్‌లలో అత్యవసర సిబ్బంది మాత్రమే అటెండ్ అయ్యారు. ఆర్టీసీ డిపోల్లోని బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. గ్యారేజీల్లో పనిచేసే కార్మికులు విధులకు అటెండ్ కాలేదు. తెల్లవారుజామున 3.30 గంటలకే కార్మిక సంఘాల నేతలు ఆర్టీసీ బస్సు డిపోల వద్దకు చేరుకొని బస్సులను బయటకు రాకుండా అడ్డుకున్నారు. గవర్నమెంట్ ఆఫీస్‌ల్లో పనిచేసే అసంఘటిత కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. పలుచోట్ల కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు నిర్వహించారు.
ఈ సమ్మెలో ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సీఐటీయూ, హెచ్ఎమ్మెస్, టీబీజీకేఎస్, ఇఫ్టూ, మాస్‌లైన్ సంఘాల నేతలు పాల్గొన్నారు. ఖమ్మంలో సీపీఎం నేత తమ్మినేని వీరభద్రంతోపాటు ఆయా చోట్ల పలువురు లీడర్లు మాట్లాడారు. కార్మికులకు నష్టం చేకూర్చే నల్ల చట్టాలను మోదీ తీసుకొచ్చి నడ్డి విరుస్తున్నారని విమర్శించారు. డిజిటల్ పేరుతో కార్మికులకు పని లేకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదానీ, అంబానీలకు కొమ్ముకాసే నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు కార్మికులు ఏకం కావాలని పిలుపునిచ్చారు.