ఆట అయిపోలేదు

ఆట అయిపోలేదు

అతడో స్పోర్ట్స్‌ పర్సన్. క్రికెట్ తప్ప మరో ప్రపంచం ఉండదు. కానీ అనుకోని పరిస్థితుల్లో దానికి దూరం కావాల్సి వస్తుంది. పరిస్థితుల ప్రభావం వల్ల మళ్లీ బ్యాట్ పడతాడు. ఆటలో అదే మ్యాజిక్ చూపిస్తాడు. కానీ అంతవరకూ అందరి దగ్గరా దాచిపెట్టిన వ్యాధి కబళించడంతో కన్నుమూస్తాడు. గుండెల్ని మెలి పెట్టిన ‘జెర్సీ’ కథ ఇది.  ఆమె ఓ పేద అమ్మాయి. కానీ మహా చురుగ్గా ఉంటుంది. అదే ఒక బాక్సింగ్‌ కోచ్‌ని ఆకర్షిస్తుంది. అతడామెను తీర్చిదిద్దే బాధ్యతను తలకెత్తుకుంటాడు. ఆమె కూడా చాంపియన్ అయ్యి ‘గురు’దక్షిణ చెల్లించుకుంది.ఆట చుట్టూ అల్లిన అందమైన కథ   ప్రేక్షకుడి గుండెల్లోకి దూసుకుపోతుంది. మంచి సినిమాగా గుర్తుండి పోతుంది. అలాంటి స్పోర్ట్స్‌ బేస్డ్‌ మూవీస్ ఇప్పటి వరకూ చాలానే వచ్చాయి.

మూకీల నాడే మొదలు

క్రీడా నేపథ్యంలో మూవీస్​ రావడం మూకీల నాడే మొదలయ్యింది. 1915లో చార్లీ చాప్లిన్ హీరోగా వచ్చిన ‘ద చాంపియన్‌’ని ప్రపంచ సినీ చరిత్రలోనే తొలి స్పోర్ట్స్ బేస్డ్ మూవీ అని చెప్తారు. మన దేశంలో 1959లో క్రికెట్ నేపథ్యంలో ఓ  ‘లవ్‌ మ్యారేజ్’ అనే సినిమా తెరకెక్కింది. సుబోధ్‌ ముఖర్జీ దర్శకుడు. దేవానంద్ హీరో. అయితే తొలుత స్పోర్ట్స్ డ్రామాలా అనిపించినా.. మాలా సిన్హాతో ప్రేమలో పడిన తర్వాత ప్రేమకథలా మారిపోతుంది. మిథున్ చక్రవర్తి ‘బాక్సర్’, కుమార్‌‌ గౌరవ్ ‘ఆల్‌ రౌండర్’, రాజ్‌ కిరణ్‌ ‘హిప్‌ హిప్‌ హుర్రే’ వంటి చిత్రాలు కూడా క్రీడా నేపథ్యంలో వచ్చినవే. తెలుగులో అశ్వినీ నాచప్ప బయోపిక్‌ ‘అశ్విని’ సంచలన విజయం సాధించింది. అందులో తన పాత్రను తనే పోషించడమే కాక, ఆ తర్వాత నటిగా కెరీర్‌‌ని కొనసాగించింది అశ్విని. ఇంకా సై, భీమిలి కబడ్డీ జట్టు, గోల్కొండ హైస్కూల్, ఒక్కడు, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, తమ్ముడు వంటి చాలా తెలుగు సినిమాలు క్రీడల ఆధారంగానే రూపొందాయి.

రీల్‌పై రియల్‌ గేమ్

స్పోర్ట్స్‌ బేస్డ్‌ మూవీస్​లో కల్పిత కథల కంటే రియల్‌ స్టోరీసే ఎక్కువగా ఉంటున్నాయి. క్రీడాకారుల జీవితాలో లేక సంచలనం సృష్టించిన పోటీలో
సినిమాలకు ముడిసరుకు అవుతున్నాయి. ‘అశ్విని’ అలా వచ్చిన సినిమానే. పరుగుల వీరుడు మిల్కా సింగ్​ జీవితం ఆధారంగా ‘భాగ్‌ మిల్కా భాగ్’ వస్తే… బాక్సింగ్ చాంపియన్‌ ‘మేరీ కోమ్’ జీవితమూ సినిమాగా రూపొందింది. బ్రిటిష్‌ వారితోనే పోటీపడి భారతీయ హాకీ టీమ్‌ కప్ అందుకోవడం ‘గోల్డ్‌’లో చూసి పులకరించాం.  గీత, బబితల ‘దంగల్’ చూశాం. ‘పాన్ సింగ్ తోమర్’ గెలుపును చూసి మురిశాం. ‘ఎం.ఎస్.ధోని’ గురించి మనకి తెలియని విషయాలు తెలుసుకున్నాం. ‘అజహర్‌‌’ ఆవేదననూ వినే ప్రయత్నం చేశాం. అయితే మరిన్ని రియల్‌ లైఫ్‌ స్పోర్ట్స్‌ మూవీస్‌ లైన్‌లో ఉన్నాయి. పీవీ సింధు బయోపిక్‌ని సోనూ సూద్‌ తీస్తుంటే, ఆమె గురువు పుల్లెల గోపీచంద్‌ పాత్రలోకి సుధీర్‌‌బాబు పరకాయ ప్రవేశం చేస్తున్నాడు. సైనా నెహ్వాల్‌గా మారడానికి పరిణీతి చోప్రా పాట్లు పడుతోంది. ఒకనాటి ఫుట్‌బాల్ కోచ్​సయ్యద్‌ పాత్ర పోషించే పనిలో పడి అజయ్‌ దేవగన్‌కి తీరిక లేకుండా పోయింది.

అది కల్పిత కథా, నిజ జీవిత గాథా అనేది  ఎలా ఉన్నా.. హీరో కానీ, హీరోయిన్‌ కానీ ఒక స్పోర్ట్స్‌ పర్సన్‌ అయితే ఆ మూవీలో కిక్‌ ఉంటుంది. ఎందుకంటే ఆట అంటే పోటీ ఉంటుంది. ఆ పోటీ ఉత్కంఠ రేపుతుంది. దాంతో ప్రేక్షకుడికి సినిమాపై చెప్పలేనంత ఆసక్తి పెరుగుతుంది. తర్వాత ఏం జరుగుతుందో అని స్క్రీన్‌కి అతుక్కుపోయేలా చేస్తుంది. అంటే ప్రేక్షకుడికి వినోదం.. ఫిల్మ్ మేకర్‌‌కి లాభం. అందుకే చిరంజీవిని ‘విజేత’గా మార్చారు. జగపతిబాబుతో ‘కబడ్డీ కబడ్డీ’ అని కూత పెట్టించారు. ‘అమ్మ నాన్న తమిళమ్మాయి’ల సాక్షిగా రవితేజని కిక్‌ బాక్సర్‌‌ని చేశారు. నితిన్‌ రగ్బీకి ‘సై’ అనేలా చేశారు.  విజయ్​తో ‘విజిల్’ వేయించనున్నారు. వరుణ్ తేజ్, రణ్‌వీర్ సింగ్, నితిన్, ఆది పినిశెట్టి, సందీప్‌ కిషన్, నాగశౌర్య, విజయ్‌ సేతుపతి తదితరులంతా  క్రీడాకారులుగా కనిపించనున్నారు. చూద్దాం… వీరి ఆట ఎలా ఉంటుందో!

క్రీడల కథలు

ఏ స్పోర్ట్స్​ డ్రామాకైనా మంచి నేపథ్యం ఉండటం ఎంత ముఖ్యమో,  బలమైన స్క్రీన్‌ ప్లే ఉండ టమూ అంతే ముఖ్యం. అలా కాకుండా కేవలం ఆటనే చూపించుకుంటూ పోతామంటే మనోళ్లకి నచ్చదు. అందుకే బలమైన కథలో ఆటను అందంగా జొప్పించాలి. రీసెంట్‌గా వచ్చిన ‘డియర్ కామ్రేడ్’ మొదట కాలేజీ స్టోరీలా ఉంటుంది. తర్వాత క్రికెటర్‌‌ లైఫ్‌ స్టోరీలా కనిపిస్తుంది. కాసే పటికి క్రీడారంగంలో ఆడపిల్లలు ఎదుర్కొనే వేధింపుల గురించిన నిజాలు బయటపెడుతుంది. అలాగే ‘మజిలీ’. క్రికెట్‌ను అమితంగా ప్రేమించేవాడు ఓ అమ్మాయి ప్రేమలో పడి ఆటను నిర్లక్ష్యం చేస్తాడు. కానీ ఆ అమ్మాయి కూతుర్ని  క్రికెటర్‌‌ని చేయడానికి తపన పడతాడు. అన్నయ్య కలను తీర్చడం కోసం కిక్‌బాక్సర్‌‌గా మారాడు ‘తమ్ముడు’. తన ప్రేమను కబడ్డీ ఆటతో గెల్చుకున్నాడు ‘ఒక్కడు’. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ అని అందరూ చెప్పుకునేలా చేయడానికి ఎన్నో కష్టాలు పడ్డాడొక యువకుడు. శారీరక లోపం ఆటకు అవరోధం కాదని నిరూపించాడు ‘ఇక్బాల్’ అనే మూగవాడు. అమ్మాయిగా జట్టులో చోటు సంపాదించలేక మగాడిగా మారి మరీ తన ప్రతిభను బయటపెట్టుకుంది ‘దిల్ బోలే హడిప్పాలో’ రాణీ ముఖర్జీ. ఇండియా ఓడిపోతే తండ్రి ఏడ్చాడని, తాను క్రికెటరై కప్పు గెల్చుకొచ్చి నాన్నకు కానుకగా ఇస్తుంది ‘కౌసల్య కృష్ణమూర్తి’. ప్రతి కథలోనూ ఆట ఉంది. దాన్ని ఆడాలనుకోవడం వెనుక బలమైన కారణం ఉంది. ఆటలో రాణించే క్రమంలో చాలా ప్రయాస ఉంది. అందుకే ఈ కథలు మనసుల్ని టచ్ చేసి మార్కులు కొట్టేశాయి. ఆ మ్యాజిక్​ లేని చిత్రాలు క్లీన్​ బౌల్డ్​ అయ్యాయి.

మన దేశంలో ఎన్ని రకాల క్రీడలున్నా.. క్రికెట్‌కి ఉన్న క్రేజ్ మరి దేనికీ లేదు. అందుకేనేమో.. క్రికెట్‌ ఆధారంగా వచ్చినన్ని సినిమాలు ఇక ఏ ఆటపైనా రాలేదు. లవ్ మ్యారేజ్, 22 యార్డ్స్, 99, 1983, అవ్వల్ నంబర్, చమత్కార్, దిల్ బోలే హడిప్పా, లగాన్, గోల్కొండ హైస్కూల్, ఇక్బాల్, కైపోచే, అప్పట్లో ఒకడుండేవాడు, స్టంప్డ్‌, విక్టరీ, పటియాలా హౌస్, మజిలీ, జెర్సీ, డియర్ కామ్రేడ్, జోయా ఫ్యాక్టర్ అంటూ చాలా భాషల్లో చాలా సినిమాలు వచ్చాయి. ఆ తర్వాత ఎక్కువ సినిమాల్లో కనిపించేది బాక్సింగ్. ఆ తర్వాతి స్థానం కబడ్డీది.

హాలీవుడ్‌లో మిగతా జానర్ల సినిమాలు ఎన్ని వస్తాయో స్పోర్ట్స్‌ బేస్డ్‌ మూవీస్ కూడా అన్ని వస్తుంటాయి. అప్పట్లో సిల్వెస్టర్ స్టాలోన్ హెవీ వెయిట్ చాంపియన్‌గా నటించిన ‘రాకీ’ మామూలు సంచలనం సృష్టించలేదు. బాక్సింగ్, ఫుట్‌బాల్, కార్ రేసింగ్, బేస్‌ బాల్ వంటి వాటిపై చాలా సినిమాలు తెరకెక్కుతూ ఉంటాయక్కడ. రూకీ, రిమెంబర్‌‌ ద టైటన్స్, డేస్‌ ఆఫ్‌ థండర్, వారియర్, ఫేసింగ్‌ ద జెయింట్స్, ఇన్‌విన్సిబుల్, అలీ, ద కరాటే కిడ్, కిక్ బాక్సర్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితాకి అంతు ఉండదు.