మనసుకి నచ్చిన వాళ్లతో జర్నీ చేస్తే...

మనసుకి నచ్చిన వాళ్లతో  జర్నీ చేస్తే...

పచ్చని చెట్లు.. ఎత్తైన కొండలు.. వాటిపై మంచు తెరలు.. మధ్య మధ్యలో లోయలు.. వీటన్నింటినీ దాటుతూ చేసే జర్నీ ​చాలామంది డ్రీమ్​. ఆ జర్నీ​ మనసుకి నచ్చిన వాళ్లతో చేస్తే ఓ జ్ఞాపకంగా మిగిలిపోతుంది. అలా తన ట్రిప్​ని మెమరబుల్​గా మార్చుకోవడానికి 28 ఏండ్ల సుధీశ్​ తోడుగా తన పెట్​ స్నోబెల్​ని తీసుకెళ్లాడు.  ఇద్దరూ కలిసి బైక్​పై దాదాపు15 రాష్ట్రాల్లో12, 000 కిలోమీటర్లు చుట్టేశారు. దీని వెనుక  ఓ మంచి ఆలోచన కూడా ఉంది.
మొన్నీమధ్య రిలీజైన ‘777 చార్లీ’ సినిమాని తలపిస్తున్న ఈ కథ మొదలైంది కేరళలో. అక్కడే పుట్టి, పెరిగిన సుధీశ్​కి చిన్నప్పట్నించీ ట్రావెలింగ్​ అంటే ఇష్టం. ఫ్రెండ్స్​తో కలిసి స్కూల్​ టూర్స్​కి వెళ్లాలన్న కోరిక బాగా ఉండేది అతనికి. కానీ, ఆర్థిక పరిస్థితుల వల్ల ఎప్పుడూ వెళ్లలేకపోయాడు. అలాగని ట్రావెలింగ్​పై ఇష్టాన్ని  వదులుకోలేదు. బాగా చదువుకొని.. మంచి ఉద్యోగం సంపాదించాలనుకున్నాడు. ఆ డబ్బుతో దేశం మొత్తం తిరగాలన్నది అతని ఆలోచన. అనుకున్నట్టే..  ఓ మెడికల్​ స్టోర్​లో మేనేజర్​గా ఉద్యోగం తెచ్చుకున్నాడు. ఇంటి అవసరాలకి పోను మిగిలిన డబ్బుని దాచుకొని.. కేరళలోనే చిన్న చిన్న ట్రిప్స్​ వేశాడు మొదట్లో. ఆ టైంలోనే ఓ  కుక్కపిల్ల రోడ్డుపై  చావు బతుకుల మధ్య కనిపించింది. దానికి ట్రీట్మెంట్​ ఇప్పించి... తనతో పాటు ఇంటికి తీసుకొచ్చాడు. దానికి స్నోబెల్​ అని పేరు కూడా పెట్టాడు. అలా మూడేండ్లు గడిచిపోయాయి.

ఆ ఆలోచన..

ఆ మూడేండ్లలో స్నోబెల్​తో కలిసి ఎన్నో ట్రిప్​లకి వెళ్లాడు సుధీశ్​. కానీ, ఎన్ని అందమైన ప్లేస్​లు తిరిగినా.. అతని మనసంతా లడఖ్​ చుట్టూనే తిరుగుతుండేది. దాంతో ఆ కలని ఎలాగైనా నెరవేర్చుకోవాలని డిసైడ్​ అయ్యాడు. అందుకోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు స్టోర్​లో పనిచేస్తూనే.. రాత్రిళ్లు జొమాటోలో ఫుడ్​ డెలివరీ చేశాడు. అలా పోగుచేసుకున్న డబ్బుతో.. తన 100 సీసీ బైక్​పై స్నోబెల్​తో కలిసి లడఖ్​ వెళ్లాలనుకున్నాడు. అయితే స్నోబెల్​ని వెంట తీసుకెళ్లాలన్న ఆలోచన వెనుక ఓ కారణం ఉంది.‘‘చాలామంది వీధికుక్కలతో దురుసుగా ప్రవర్తిస్తుంటారు. వాటిని ఇష్టం వచ్చినట్టు కొడుతుంటారు. ఫారెన్​ కుక్కల్ని ఒకలా.. స్ట్రీట్​ డాగ్స్​ని  మరోలా ట్రీట్​ చేస్తుంటారు. అది తప్పు అని నిరూపించడానికే నా కుక్కతో కలిసి జర్నీ చేయాలనుకున్నా’ అన్నాడు సుధీశ్​. అయితే ఈ జర్నీ కోసం చాలా ప్రికాషన్స్​ తీసుకున్నాడు అతను​. యాభై వేల రూపాయలతో.. చిన్న చిన్న ట్రిప్​ల వరకు ఓకే. కానీ, వేల కిలోమీటర్లు స్నోబెల్​తో జర్నీ అంటే ... కష్టమే. దాంతో అన్ని మైళ్లు అది కంఫర్టబుల్​గా, సేఫ్​గా  ఉండటానికి ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలన్న దానిపై స్టడీ చేశాడు. యూట్యూబ్ వీడియోలు చూసి.. దానికోసం ప్రత్యేకంగా సీటు తయారుచేశాడు. ఆ సీటుని బైక్​ వెనుక సీటు దగ్గర ఫిట్​ చేశాడు.  టెస్టింగ్​ కోసం దాంతో కలిసి చుట్టు పక్కలున్న ప్లేస్​లకి వెళ్లాడు. స్నోబెల్​కి స్పెషల్​ ట్రైనింగ్​ ఇచ్చాడు. వెటర్నరీ డాక్టర్​ని కలిసి.. స్నోబెల్​కి అవసరమైన టెస్ట్​లన్నీ చేయించాడు. పూర్తిగా నమ్మకం వచ్చాకే... 50,000 రూపాయలతో కొచ్చి నుంచి లడఖ్​​ జర్నీ  మొదలుపెట్టాడు. క్యాంపెయిన్​ స్టవ్​, స్లీపింగ్​ బ్యాగ్స్, టెంట్​... ఇలా  అవసరమైన వస్తువులన్నీ వెంట తీసుకెళ్లాడు సుధీశ్​​. అలాగే ఈ జర్నీలో  ఏ రోజూ హోటళ్ల​లో బస చేయలేదు. బ్రేక్​ఫాస్ట్​, లంచ్​ కూడా తనే ప్రిపేర్​ చేసుకునేవాడు. దాంతో.. బడ్జెట్​లోనే ఈ మధ్యే  తన డ్రీమ్​ ట్రిప్​ కంప్లీట్​ చేశాడు. 

మే 8 న మా లడఖ్​​ జర్నీ మొదలైంది. నిజానికి  నా కలని.. నా కంటే స్నో బెల్​ ఎక్కువ ఆస్వాదించింది. ముఖ్యంగా జమ్మూ– కాశ్మీర్​ వెళ్లినప్పుడు దాని ఆనందం చూడాలి. మంచులో గెంతులేసింది. నాతో పాటు కొండలు, గుట్టలు ఎక్కింది. జలపాతాలతో ఆటలాడింది కూడా. నా బైక్​ వెనుక కూర్చున్న స్నోబెల్​ని చూసి.. చాలామంది మమ్మల్ని పలకరించారు. మా కథ అడిగి తెలుసుకొని, ప్రేమగా దాని తల నిమిరారు. ఈ జర్నీ ద్వారా కొంతమందికైనా స్ట్రీట్​ డాగ్స్​ గురించి చెప్పగలిగా అన్నాడు సుధీశ్​.