కర్నాటక అసెంబ్లీ ముందు కుటుంబం సూసైడ్ ​అటెంమ్ట్​

కర్నాటక అసెంబ్లీ ముందు కుటుంబం సూసైడ్ ​అటెంమ్ట్​
  •  ఇంటిని బ్యాంకు అధికారులు వేలం వేయడంతో మనస్తాపం

బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ ముందు ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తీసుకున్న అప్పు తీర్చకపోవడంతో వారి ఇంటిని బ్యాంకు అధికారులు వేలం వేయగా.. మనస్తాపానికి గురై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. బుధవారం బెంగళూరులోని కర్నాటక అసెంబ్లీ(విధాన సౌధ) వద్దకు మహిళలు, పిల్లలతో వచ్చిన కుటుంబ సభ్యులు.. వెంట తెచ్చుకున్న కిరోసిన్​ను ఒక్కసారిగా తమపై పోసుకున్నారు. 

వెంటనే పోలీసులు స్పందించి వారిని అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. అనంతరం వారిని స్థానిక పోలీస్ స్టేషన్​కు తరలించారు. ఈ సందర్భంగా ఆ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. 2016లో అల్లం సాగు వ్యాపారం  చేసేందుకు బెంగళూరు సిటీ కో ఆపరేటివ్ బ్యాంక్ లో  రూ.50 లక్షలు లోన్ తీసుకున్నామని తెలిపారు. ఇప్పటి వరకు రూ.95 లక్షలు చెల్లించామని, వ్యాపారంలో నష్టాలు రావడంతో ఇంకా కొంత వడ్డీతో పాటు అసలు చెల్లించలేదని చెప్పారు.

 అయితే, రూ.3 కోట్ల విలువైన తమ ఇంటిని బ్యాంకు అధికారులు  కేవలం రూ.1.41 కోట్లకే వేలం వేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ విషయంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య జోక్యం చేసుకోవాలనే ఆత్మహత్యకు యత్నించినట్టు వారు చెప్పారు. తమ బిడ్డలకు కడుపు నిండా తిండిపెట్టేందుకు కూడా డబ్బులు లేవని వారు వాపోయారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన 
వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.