పాకిస్తాన్‌‌లో మరో ఆత్మాహుతి దాడి .. ఒకరు మృతి.. 21 మందికి గాయాలు

పాకిస్తాన్‌‌లో మరో ఆత్మాహుతి దాడి .. ఒకరు మృతి.. 21 మందికి గాయాలు

పెషావర్:  పాకిస్తాన్‌‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌‌లో భద్రతా దళాల కాన్వాయ్‌‌ను లక్ష్యం గా చేసుకుని ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందారు.13 మంది భద్రతా సిబ్బంది సహా 21 మంది గాయపడ్డారు. ఆదివారం బన్నూ కంటోన్మెంట్‌‌లోని ఆజాద్ మండి సమీపంలో ఈ ఎటాక్ జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. వజీరిస్తాన్ జిల్లా నుంచి బన్నూకి వెళ్తున్న సెక్యూరిటీ ఫోర్సెస్ కాన్వాయ్‌‌ను పేలుడు పదార్థాలతో కూడిన ట్రై-వీలర్ ఢీకొట్టిందని చెప్పారు.

దాడిలో చనిపోయిన వ్యక్తి  ఒక పాదచారి అని వెల్లడించారు. గాయపడినవారిలో 13 మంది భద్రతా సిబ్బంది కాగా.. 8 మంది సాధారణ పౌరులని వివరించారు. వారిని బన్నూలోని కంబైన్డ్ మిలటరీ ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తు్న్నట్లు తెలిపారు. ముగ్గురు అధికారుల పరిస్థితి క్రిటికల్ గా ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా..ఈ ఆత్మాహుతి దాడికి తామే బాధ్యులమని తెహ్రీక్ ఇ- తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ)కి చెందిన హఫీజ్ గుల్ బహదూర్ గ్రూప్ ప్రకటించింది. ఇటీవల పాకిస్తాన్ భద్రతా దళాలు ఎనిమిది మంది టెర్రరిస్టులను హతమార్చాయి. అందుకు ప్రతీకారంగానే ఈ ఆత్మహుతి దాడి జరిగినట్లు పాక్ మిలిటరీ మీడియా విభాగం అభిప్రాయపడింది.