‘మేం ఫేమస్’ అంటూ తొలి చిత్రంతోనే హీరోగా, దర్శకుడిగా మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు సుమంత్ ప్రభాస్. తాజాగా తను హీరోగా రెండో చిత్రం మొదలైంది. ఈ చిత్రంతో సుభాష్ చంద్ర దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అభినవ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో ఆదివారం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ముహూర్తం షాట్‌కు హీరో శ్రీవిష్ణు క్లాప్ కొట్టగా, నిర్మాత సురేష్‌బాబు కెమెరా స్విచాన్ చేశారు. దర్శకులు శ్రీకాంత్ ఓదెల, శౌర్యువ్, పి మహేష్ బాబు తొలి షాట్‌కి దర్శకత్వం వహించారు.
అల్లు అరవింద్ స్క్రిప్ట్‌ని మేకర్స్‌కి అందజేశారు. నిర్మాత సునీల్ నారంగ్ అతిథిగా హాజరయ్యారు. ఈ చిత్రంతో నిధి ప్రదీప్ హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. జగపతి బాబు, రాజీవ్ కనకాల, హర్షవర్ధన్, సుదర్శన్, రాజ్‌కుమార్ కసిరెడ్డి ఇతర పాత్రలు పోషిస్తున్నారు. భీమవరం బ్యాక్‌డ్రాప్‌లో సాగే రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందనుందని సుమంత్ ప్రభాస్ చెప్పాడు. దర్శకుడు సుభాష్ చంద్ర మాట్లాడుతూ ‘గోదారి గట్టున కూర్చొని ఫ్రెండ్స్‌తో కబుర్లు చెప్పుకుంటే ఎలా ఉంటుందో ఈ సినిమా అంత హాయిగా ఉంటుంది. ఇందులో రెండు ప్రేమ కథలు ఉన్నాయి. హీరో, హీరోయిన్‌ది ఒక లవ్ స్టోరీ అయితే, తండ్రి కూతుర్లది మరో లవ్ స్టోరీ. అందర్నీ అలరించేలా ఉంటుంది’ అని చెప్పాడు.