జోరందుకోని ప్రచారం.. ఎన్నికల క్యాంపెయిన్​పై మండుటెండల ఎఫెక్ట్

జోరందుకోని ప్రచారం..  ఎన్నికల క్యాంపెయిన్​పై మండుటెండల ఎఫెక్ట్
  • ఎండల భయంతో బయటకు రాలేకపోతున్న అభ్యర్థులు
  • షెడ్యూల్​కు, పోలింగ్​కు చాలా గ్యాప్ ఉండడంతో తగ్గిన జోష్
  • ముందుగా ఎన్నికలున్న రాష్ట్రాలపైనే జాతీయ నేతల దృష్టి
  • ఇప్పటి నుంచే ప్రచారం చేస్తే ఖర్చు పెరిగిపోతుందని నేతల భయం
  • చివరి మూడు వారాల్లోనే అసలు ప్రచారంపై ఫోకస్

హైదరాబాద్, వెలుగు:  లోక్​సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చి దాదాపు నెల రోజులవుతున్నా రాష్ట్రంలో కొన్ని చోట్ల మినహా ప్రచార జోరు కనిపించట్లేదు. ఎన్నికల నోటిఫికేషన్​కు ఇంకా వారం రోజుల టైం ఉంది. ముందే ప్రచారం మొదలుపెట్టి ఎక్కువ రోజులు చేస్తే ఖర్చు తడిసి మోపెడవుతుందని అభ్యర్థులు జంకుతున్నట్లు తెలుస్తున్నది. పార్టీలు కూడా బహిరంగ సభలు, రోడ్ షోలు ఒకట్రెండు మినహా పెద్దగా నిర్వహించలేదు. మరోవైపు మండుతున్న ఎండలు, వడదెబ్బలు అభ్యర్థులను భయపెడుతున్నాయి. దాదాపు అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల నుంచి 43 డిగ్రీలదాకా ఉండటంతో ప్రచారంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జనం నుంచి కూడా పెద్దగా స్పందన రావడం లేదు. 


పార్టీల రాష్ట్ర, జాతీయ నాయకత్వాలు రంగంలోకి దిగితేనే ప్రచారానికి ఊపు వస్తుందని కాంగ్రెస్ అభ్యర్థులు భావిస్తుంటే.. మరోసారి ప్రధాని మోదీ రాష్ట్రానికి వస్తే తమ ప్రచారం బలంగా ఉంటుందని బీజేపీ అభ్యర్థులు అంటున్నారు. ఇప్పటికే సమస్యల్లో ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థులు కేసీఆర్ రంగంలోకి దిగితేనే ప్రజల్లోకి వెళ్లగలమన్న అభిప్రాయంతో ఉన్నారు. పార్టీ అధిష్ఠానం నుంచి వచ్చే హామీ, ఫండ్స్ కోసం కూడా మూడు పార్టీల అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ఆ లెక్క తేలితే, సొంత ఖర్చు ఎంతవుతుందో అంచనా వేసుకొని రంగంలోకి దిగాలనే ఆలోచనలో ఉన్నారు. కొంతమంది అభ్యర్థులు మాత్రం గట్టిగానే ప్రచారం కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో పోటీలో ఉన్న మూడు పార్టీల్లో రెండు జాతీయ పార్టీలే. దీంతో ఆ పార్టీల జాతీయ నాయకత్వం ఫోకస్ ముందుగా ఎలక్షన్ జరిగే రాష్ట్రాలపైనే ఉంది. మెయిన్ లీడర్లంతా బయట ప్రచారంలో బిజీగా ఉన్నారు. అయినా రాహుల్​గాంధీతో కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహించగా.. బీజేపీ మోదీ, అమిత్​ షాతో సభలు ఏర్పాటు చేసింది. అసెంబ్లీ ఓటమి, వలసలతో సతమతమవుతున్న బీఆర్ఎస్ పొలంబాట, రైతు దీక్షల పేరుతో ఒకటిరెండు రోజులు కార్యక్రమాలు చేపట్టింది. దాదాపుగా అన్ని పార్టీల అగ్రనాయకత్వం పూర్తిస్థాయిలో రంగంలోకి దిగలేదు. 

కొందరు మాత్రం జోరుగా జనంలోకి

 కాంగ్రెస్ లో సీఎం, పీసీసీ చీఫ్​ రేవంత్ రెడ్డి మొత్తం బాధ్యతను తన భుజాలపైనే వేసుకున్నారు. సెగ్మెంట్లవారీగా కో ఆర్డినేషన్ కమిటీ మీటింగులు పెట్టి ఒక్కో సెగ్మెంట్లో ఇన్​చార్జులను రంగంలోకి దింపుతున్నారు. తాజాగా భువనగిరి గెలుపు బాధ్యతను ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అప్పజెప్పారు. అంతకుముందే కొన్ని కీలక నియోజకవర్గాల బాధ్యతలను సీనియర్ మంత్రులకు అప్పగించారు. మరోవైపు ఎండలున్నా లెక్కచేయకుండా ఇప్పటికే కొందరు జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. మహబూబ్ నగర్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి అందరికన్నా ముందు ప్రచారం మొదలుపెట్టారు. పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ లో పోటీచేస్తున్న గడ్డం వంశీకృష్ణ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. సెగ్మెంట్ పరిధిలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా తమ నియోజకవర్గాల్లో రోజూ మండల, గ్రామ స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ తనదైన శైలిలో ఊరూరా ప్రచారం చేస్తున్నారు. ఆమెకు తోడుగా మంత్రి సీతక్క విస్త్రతంగా జనంలోకి వెళ్తున్నారు. నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్ రెడ్డి ఇప్పుడిప్పుడే ప్రచారం మొదలుపెట్టారు. మల్కాజ్ గిరి బరిలో ఉన్న పట్నం సునీత మహేందర్ రెడ్డి, చేవెళ్ల అభ్యర్థి రంజిత్ రెడ్డి స్థానిక నేతలతో వరుస మీటింగ్ లు పెడుతున్నారు. కార్నర్ మీటింగులతో జనంలోకి వెళ్తున్నారు. 

 బీజేపీలో చేవెళ్ల అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ముందు నుంచీ ప్రచారం చేస్తున్నారు. టికెట్ ఖరారు అయినప్పటి నుంచి కుటుంబ సమేతంగా జనంలోకి వెళ్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి రోజూ సికింద్రాబాద్ లో ఎక్కడోచోట రోడ్ షో నిర్వహిస్తున్నారు. కరీంనగర్ లో బండి సంజయ్, నిజామాబాద్ లో ధర్మపురి అర్వింద్ స్థానికంగా మీటింగ్​లతో జనంలోకి పోతున్నారు. ఎలక్షన్ సందడి మొదలైనప్పటి నుంచి వీరు దాదాపుగా హైదరాబాద్ రాకుండా సెగ్మెంట్ మీదే ఫోకస్ పెట్టారు. మెదక్ లో రఘునందన్ రావు, హైదరాబాద్ లో కొంపెల్ల మాధవీలత విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మల్కాజ్ గిరి లో మాజీ మంత్రి ఈటల రాజేందర్, మహబూబ్ నగర్ లో డీకే అరుణ కూడా జోరుగా ప్రచారం చేస్తున్నారు. 

  ఇక బీఆర్ఎస్​ను అసెంబ్లీ ఓటమి ఎఫెక్ట్, వలసల సమస్య వెంటాడుతున్నాయి. ఒకరిద్దరుగా అభ్యర్థులను ముందే ప్రకటించినా.. కొంత నిరాసక్తత కనిపిస్తున్నది. ఒకరిద్దరు మినహా చాలామంది అభ్యర్థులు ఇప్పటికీ పూర్తిస్థాయిలో ప్రచారం మొదలు పెట్టలేదు. వరుసగా అవినీతి ఆరోపణలు, అభ్యర్థులుగా అనుకున్న తర్వాత కొందరు తప్పుకోవడం, ఫోన్​ ట్యాపింగ్ కలకలం, అరెస్టులు జరుగుతాయన్న ప్రచారం బీఆర్ఎస్ నేతలను గందరగోళంలో పడేసింది. కరీంనగర్​లో వినోద్ రావు, మల్కాజ్ గిరిలో రాగిడి లక్ష్మారెడ్డి, నాగర్ కర్నూల్​లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కొంత ప్రచారంలో కనిపిస్తున్నారు. 

నామినేషన్ల తర్వాతే..!

ఈ నెల 18న నోటిఫికేషన్ రాగానే నామినేషన్ల పర్వం మొదలు కానుంది. అప్పటి నుంచి వచ్చేనెల 13న ఎన్నికలకు మూడువారాల గడువు ఉంటుంది. దీంతో నామినేషన్ల తర్వాతే పూర్తిస్థాయిలో జనంలోకి పోవడం, భారీగా ప్రచారం చేసే ప్లానింగ్ లో అభ్యర్థులు ఉన్నారు. రెండు ప్రధాన పార్టీలు కూడా జాతీయ నేతలతో వరుసగా మీటింగ్ లు నిర్వహించడానికి సిద్ధమవుతున్నాయి.