తెలంగాణలో ఎండల తీవ్రత దడ పుట్టిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి నెల చివర నుంచే ఎండలు మండిపోతున్నాయి. ఉదయం, సాయంత్రం వేళలో వాతావరణం చల్లగా ఉన్నా.. పగటిపూట మాత్రం సూర్యుడు విజృంభిస్తున్నాడు. నిప్పులు చెరిగే ఎండలతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. గత వారం రోజులుగా హైదరాబాద్ తోపాటు పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో రానున్న 5 రోజులు తెలంగాణ వ్యాప్తంగా ఎండలు తీవ్రంగా ఉంటాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.
మార్చి 3వ తేదీ ఆదివారం నుంచి గురువారం వరకు ఐదు రోజులపాటు ఎండల తవ్రత రికార్డు స్ధాయిలో పెరగనున్నట్లు తెలిపింది. ఈ రోజులల్లో 37 డిగ్రీల సెల్సీయస్ నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. రాత్రి వేళల్లోనూ సాదారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని తెలిపింది. ఇక, హైదరాబాద్ లోనూ ఎండలు మండిపోతున్నాయి. 37 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో నగర వాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దీంతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటనే భయపడిపోతున్నారు. ఎండల తీవ్రత పెరగనున్న క్రమంలో జనాలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
