పిందె నుంచి పండు వరకూ మామిడి రుచే వేరు. అందుకే వేసవిలో ఈ పండ్లను చిన్నా, పెద్దా అంతా మామిడి రుచిని ఆస్వాదిస్తుంటారు. ఆహా! ఏమి రుచి అంటూ మామిడిని పొగుడుతుంటారు. కూడా. అయితే అందరి హాట్ ఫేవరెట్ మామిడిని ఎప్పుడూ ఒకేలా ఎందుకు తినాలి. వెరైటీగా వండుకుని తినొచ్చుగా. అదెలా అంటారా! ఇవిగో ఈ రెసిపీలు ఫాలో అయిపోండి.
మామిడి తాండ్ర తయారీకి కావాల్సినవి ;
- మామిడిపండ్లు- మూడు
- చక్కెర- 100 గ్రాములు
- యాలకులు- మూడు
- నెయ్యి- రెండు టేబుల్ స్పూన్లు
తయారీ విధానం ; మామిడి పండ్లు తొక్క తీసి ముక్కలుగా తరగాలి. వాటిని మిక్సీ పట్టి, గుజ్జును గిన్నెలోకి తీయాలి. పాన్ వేడిచేసి మామిడి పండు గుజ్జు వేసి దగ్గర పడే వరకు ఉడికించాలి. దగ్గర దగ్గర సన్నటి మంటపై పావుగంట నుంచి ఇరవై నిమిషాలు ఉడికాక చక్కెర, యాలకులు వేయాలి. చక్కెర బాగా కరిగి పాకంలా అయ్యేవరకు ఉడికించాలి. మిశ్రమం సగానికి సగం అయ్యాక స్టవ్ ఆపాలి. నెయ్యి రాసిన ప్లేట్ లో మిశ్రమాన్ని సమంగా పరవాలి. మూత పెట్టి ఆ ప్లేటిని వారం రోజులు ఎండలో పెట్టి నచ్చిన షేప్ లో కట్ చేయాలి. అంతే మామిడి తాండ్ర రెడీ.
మామిడి ఫాలుదా తయారీకి కావలసినవి
- పాలు- పావు లీటర్
- సేమ్యా(నానబెట్టిన)- అరకప్పు
- మామిడిపండు గుజ్జు- ఒకకప్పు
- రోజ్ సిరప్- రెండు టేబుల్ స్పూన్లు
- సబ్జా గింజలు (నానబెట్టిన) - పావు కప్పు
- చక్కెర - రెండు టేబుల్ స్పూన్లు
- పచ్చికోవా-కొద్దిగా
- ఐస్ క్యూబ్స్ - తగినన్ని
- బాదం పలుకులు-కొన్ని
తయారీ విధానం: గిన్నెలో పాలు పోసి చక్కెర, రోజ్ సిరప్, ఐస్ క్యూబ్స్ వేసి బాగా కలపాలి. సర్వింగ్ గ్లాస్లో కొన్ని సబ్జా గింజలు కొద్దిగా నానబెట్టిన సేమ్యా మామిడి పండు గుజ్జు, పచ్చికోవా వేయాలి. అందులో ముందుగా చేసి పెట్టిన పాల మిశ్రమం కూడా కలపాలి. తర్వాత నానబెట్టిన సబ్జా గింజలు, రోజ్ సిరప్, మ్యాంగో గుజ్జు వేయాలి. చివరిగా బాదం తరుగుతో గార్నిష్ చేస్తే మ్యాంగో ఫాలుడా రెడీ.
మ్యాంగో పాప్సికల్స్ తయారీకి కావాల్సినవి ;
- మామిడి పండ్లు - రెండు,
- తేనె - 15 మిల్లీ లీటర్లు,
- కొబ్బరి పాలు - 50 మిల్లీ లీటర్లు
- ఆరెంజ్ జ్యూస్ - 3 మిల్లీ లీటర్లు
తయారీవిధానం ; ముందుగా మామిడి పండ్లు తొక్క తీసి చిన్నచిన్న ముక్కలుగా తరగాలి. మిక్సీ జార్లో మామిడి ముక్కలు, తేనె, కొబ్బరి పాలు, ఆరెంజ్ జ్యూస్ వేసి మిక్సీ పట్టి గుజ్జు చేయాలి. ఆ మిశ్రమాన్ని చాకోబార్ మౌల్డ్ లో వేసి 4 గంటలు ఫ్రిజ్ లో పెడితే మ్యాంగో పాప్సికల్స్ రెడీ, చాకోబార్ మాల్ట్ కి బదులు గ్లాసుని కూడా వాడొచ్చు . ఉన్న గ్లాసులో మ్యాంగో గుజ్జు వేసి ఐస్ పుల్ల గుద్ది ఫ్రిజ్ లో పెట్టినా పాప్పికల్స్ పర్ఫెక్ట్ గా వస్తాయి .
