Weather update: బాబోయ్ ఎండలు .. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ఆరెంజ్​ ఎలర్ట్​ జారీ

Weather update: బాబోయ్ ఎండలు .. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ఆరెంజ్​ ఎలర్ట్​ జారీ

తెలంగాణలో ఎండల తీవ్రత పెరిగింది. భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుతన్నాడు. మంగళవారం ( మార్చి 26)ఆదిలాబాద్ జిల్లాలో ఏ ఏడాదిలోనే అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

తెలంగాణ రాష్ట్రంలో రానున్న ( మార్చి 28 నుంచి)  3 రోజులు ఉష్ణోగ్రతలు పెరుగనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. సాధారణం ఉష్ణోగ్రతలు కంటే 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశముందని తెలియజేస్తూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ క్రమంలో ఆరుబయట పనిచేసేవారితో పాటు పగటి పూట ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

తెలంగాణలో గత కొద్ది రోజులుగా పొడి వాతావరణం ఉండగా.. ప్రస్తుతం ఎండల తీవ్రత మరింత పెరిగింది. భానుడి భగభగలు ప్రారంభమయ్యాయి. మార్చి 26 నుంచి  ఉష్ణోగ్రతలు మరింత అధికమయ్యాయి. ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఆదిలాబాద్‌ జిల్లాలో నమోదయ్యాయి. మార్చి 26న  తలమడుగు, జైనథ్‌ మండలాల్లో గరిష్ఠంగా 42.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదనైనట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. బేల మండలం చప్రాలలో 42.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా ఆసిఫాబాద్‌లో 42 డిగ్రీలు నమోదయింది.

ALSO READ | తాగునీటి కోసం .. తెలంగాణ సమ్మర్​ యాక్షన్​ ప్లాన్

మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 12 జిల్లాల్లో 40.8 డిగ్రీల నుంచి 42.3 డిగ్రీల మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.రాష్ట్ర అభివృద్ధి, ప్రణాళికా సంస్థ ఎండల పెరుగుదలపై ప్రజలను అప్రమత్తం చేస్తూ ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. ఆరుబయట పనిచేసే వారు, మధ్యాహ్నం పూట ప్రయాణాలు చేసేవారు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.ముఖ్యంగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య బయటకు వెళ్లకపోవటమే ఉత్తమని చెబుతున్నారు. కాటన్ దుస్తులు ధరించాలని.. బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు, తలపై టోపీ వంటి ధరించాలని చెబుతున్నారు. వడదెబ్బకు గురి కాకుండా నీళ్లు ఎక్కువగా తాగాలని.. పండ్ల రసాలతో పాటు కొబ్బరినీళ్లు తీసుకోవాలని సూచిస్తున్నారు. మసాలా ఫుడ్స్‌కు దూరంగా ఉండి తేలికైన ఆహారం తీసుకోవాలని అంటున్నారు.